తెలుగులో పూరీజగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన 'టెంపర్' చిత్రం భారీ విజయం సాధించకపోయినా ఇందులో ఎన్టీఆర్ నటవిశ్వరూపానికి మాత్రం బాగా మార్కులు పడిన సంగతి తెలిసిందే. కాగా ఈచిత్రం తమిళ రీమేక్‌లో శింబు చేస్తాడని వార్తలు వచ్చినా, చివరకు ఇందులో విశాల్ నటించనున్నట్లు ఖరారైన విషయం తెలిసిందే. కాగా ఈచిత్రాన్ని తమిళంలో నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు, బండ్లగణేష్‌లు నిర్మిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే కాస్త తేడా మనిషైన బండ్లగణేష్‌ను నిర్మాతగా తీసుకోకుండా ఈ చిత్రం రైట్స్‌ను ఆయన నుండి కొనుగోలు చేయాలని బుజ్జి, మధులు డిసైడ్ అయ్యారని సమాచారం. ఇక విశాల్ విషయానికి వస్తే తెలుగువాడైన ఆయన తమిళంలో మంచి మాస్ హీరోగా ఎదుగుతున్నాడు. గతంలో విశాల్ పలు చిత్రాల్లో పోలీస్ పాత్రలు చేసి మెప్పించాడు. కానీ ఆయన తన కెరీర్‌లో ఇప్పటివరకు ఒకే ఒక్క తెలుగు రీమేక్‌లో నటించాడు. తెలుగులో గోపీచంద్ నటించిన 'శౌర్యం' చిత్రం రీమేక్ 'వేడి' అనే చిత్రం చేశాడు. ఈ చిత్రం ఫ్లాప్ అయింది. అప్పటినుండి విశాల్ తెలుగు రీమేక్‌లు చేయలేదు. తమిళ దర్శకులతోనే చిత్రాలు చేసి వాటిని తెలుగులోకి డబ్బింగ్ చేస్తున్నాడు. అదే తెలుగు రీమేక్ అయితే ఆయనకు తెలుగులో తన చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉండదు. కానీ 'టెంపర్' విషయంలో మాత్రం విశాల్ చాలా తర్జనభర్జన పడి మరీ ఒప్పుకున్నాడట. మరి ఈ చిత్రం ఆయనకు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో వేచిచూడాలి. కాగా ఈచిత్రం తమిళ రీమేక్ దర్శకునిగా అనల్ అరసు ఎంపికైనట్లు సమాచారం.