నాలుగేళ్లుగా హిట్ సినిమా లేకుండా సందిగ్దంలో పడిపోయిన సునీల్‌కు ఇటీవల దిల్‌రాజు చిత్రం 'కృష్ణాష్టమి' చిత్రం కూడా నిరాశనే మిగిల్చింది. కాగా ప్రస్తుతం ఆయన వంశీకృష్ణ ఆకేళ్ల దర్శకత్వంలో 'జక్కన్న' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. మొత్తానికి హీరోగా తనకు పెద్ద హిట్ ఇచ్చిన 'మర్యాదరామన్న' చిత్రం దర్శకుడు రాజమౌళికి ఉన్న 'జక్కన్న' అనే ముద్దుపేరును పెట్టుకొని ఈసారి సునీల్ ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. దీని తర్వాత ఆయన రచయిత, దర్శకుడు వీరుపోట్ల దర్శకత్వంలో 'వీడు.. గోల్డ్ ఎహె..' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలపైనే సునీల్ హీరో కెరీర్ ఆధారపడివుంది. 'జక్కన్న' యాక్షన్‌ఎంటర్‌టైనర్ కావడంతో యాక్షన్ సినిమాలో సునీల్‌ను ప్రేక్షకులు ఎలా జీర్ణించుకోగలరు? అనే విషయంలో సందేహాలు నెలకొని ఉన్నాయి. వీరుపోట్ల చిత్రం మాత్రం పక్కా కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. మరి సునీల్ నుదిటి రాత ఎలా ఉందో? ఈ చిత్రాల భవిష్యత్తుపై ఆధారపడివుందని ఖచ్చితంగా చెప్పవచ్చు.