తన కెరీర్ మొదట్లో మంచి విజయాలతో దూసుకెళ్లిన హీరో నితిన్ ఆ తర్వాత దాదాపు వరుసగా డజను సినిమాలలో నటించి ఒక్క హిట్ కూడా లేక ఇబ్బందులు పడ్డాదు. ఆ తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్‌లో 'ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే' చిత్రాలతో వరుసగా రెండు సూపర్‌హిట్స్ కొట్టి మరలా ఫామ్‌లోకి వచ్చాడు. కానీ ఆ తర్వాత ఆయన పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో చేసిన 'హార్ట్ ఎటాక్' కేవలం యావరేజ్ మాత్రమే. ఇక ఆ తర్వాత వచ్చిన 'చిన్నదాన నీకోసం, కొరియర్ బోయ్ కళ్యాణ్' లు ఫ్లాప్ అయ్యాయి. దీంతో నితిన్‌కు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌శ్రీనివాస్‌తో చేస్తున్న'అ..ఆ' చిత్రం అగ్నిపరీక్షగా మారింది. వాస్తవానికి ఇప్పటివరకు నితిన్ మార్కెట్ రేంజ్ కేవలం 25 కోట్ల లోపే. కానీ 'అ...ఆ' చిత్రాన్ని త్రివిక్రమ్ 35కోట్ల దాకా బడ్జెట్ పెట్టి భారీగా తీస్తున్నాడు. నితిన్ రేంజ్‌కు మించి ఈ చిత్రానికి భారీగా బడ్జెట్‌ను పెడుతుండటంతో నిర్మాత రాధాకృష్ణ బాగా టెన్షన్ పడుతున్నాడట. ఈ చిత్రం నిర్మాతలకు, బయ్యర్లకు అందరికీ లాభాలు తేవాలంటే దాదాపు 50కోట్లను సాధిస్తేనే సాధ్యమవుతుందని, కానీ నితిన్ చిత్రం అంత వర్కౌట్ చేస్తుందా? లేదా? అనే సందేహాలను ట్రేడ్‌వర్గాలు వెలిబుచ్చుతున్నాయి. కానీ త్రివిక్రమ్ మీద నమ్మకంతో ఈ చిత్రం బిజినెస్ ఊపుగానే సాగుతోంది. నితిన్ హీరో అయినప్పటికీ ఇందులో సమంత, నదియా వంటి వారు నటిస్తుండటం, వివిధ టెక్నీషియన్స్ ఈ చిత్రం నుండి మధ్యలో వైదొలగడం వంటి కారణాలతోనే బడ్జెట్ మరింత పెరిగిందని, షూటింగ్ డేట్స్ పెరగడం కూడా దీనికి మరో కారణంగా ఫిల్మ్‌నగర్ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి త్రివిక్రమ్ నితిన్ రేంజ్‌ను పెంచగలడా? లేక ఆయన బెట్టింగ్ చేస్తున్నాడా? అనే అనుమానాలను ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.