బ్లాక్‌బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కాస్త తేడా మనిషి. ఆర్థికవిషయాల్లో ఆయన అనేకసార్లు ఎందరినో ఇబ్బందిపెట్టినట్లు గతంలో అనేక వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఆయన పూరీజగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా చేసిన 'టెంపర్' చిత్రం ఆర్దికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు హీరో సచిన్‌జోషి ఆయనకు ఆర్థికంగా సహాయం చేశాడట. అలాగే బండ్ల గణేష్ నిర్మాతగా బాలీవుడ్‌లో వచ్చిన 'ఆషికి2'ని తెలుగులో 'నీజతగా నేనుండాలి' అనే చిత్రాన్ని తీశాడు. సచిన్‌జోషి హీరోగా నటించిన ఈ చిత్రానికి పేరుకు మాత్రమే బండ్ల గణేష్ నిర్మాత. అసలు పెట్టుబడి మొత్తం సచిన్‌జోషీనే పెట్టిన విషయం బహిరంగ రహస్యమే ఈ చిత్రం డిజాస్టర్‌గా మిగిలింది. అప్పటి నుండి బండ్ల గణేష్‌కు, సచిన్‌జోషిలకు మధ్య ఆర్దిక విషయాల్లో పేచీ వచ్చింది. జోషికి గణేష్ కొంత డబ్బు ఎగవేశాడని సమాచారం. దాంతో ఎప్పటినుండో వీరిద్దరి మధ్య వార్ జరుగుతోంది. ట్విట్టర్ వేదికగా వీరిద్దరు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. తాజాగా ఇటీవల సచిన్ ట్విట్టర్‌లో గణేష్‌ని జైలుకు పంపిస్తానని, ఆయన సినిమాలను విడుదల కానివ్వనని పరోక్షంగా హెచ్చరికలు చేశాడు. కాగా ప్రస్తుతం గణేష్ మలయాళంలో వచ్చిన 'టూ కంట్రీస్' చిత్రం రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రంలో నటించమని ఎందరు హీరోలను అడిగినా వారు మాత్రం ముందుకు సచిన్ సమస్యను పరిష్కరించుకో.. అని సలహాలు ఇస్తున్నారట. గణేష్ చిత్రంలో నటిస్తే ఆ చిత్రం విడుదల సమయంలో సచిన్ ఆటంకాలు సృష్టించే అవకాశాలు ఉండటంతో వారిద్దరు సమస్యను పరిష్కరించుకోమని సలహా ఇవ్వడానికి కారణం అదేనని సమాచారం. దాంతో గణేష్ ఎటూ పాలుపోని సమయంలో సచిన్‌తో రాజీ పడటానికి మధ్యవర్తులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది..!