తక్కువ బడ్జెట్‌లో తీసిన నాగ్ 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రం పెద్ద విజయం సాధించి హీరోగా, నిర్మాతగా నాగ్‌కు ఎంతో పేరును, లాభాలను తీసుకొచ్చింది. కాగా తాజాగా ఆయన కార్తీతో కలిసి తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో పివిపి సంస్ధ భారీగా నిర్మించిన 'ఊపిరి' చిత్రం ఈనెల 25న రెండు భాషల్లో విడుదలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రాన్ని ఏకకాలంలో రెండు భాషల్లో నిర్మించడం వల్ల ఈ చిత్రానికి పివిపి సంస్థ భారీగానే బడ్జెట్‌ను కేటాయించింది. వంశీపైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం గురించి ఇప్పుడు ట్రేడ్‌వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. 'ఊపిరి' చిత్రానికి దాదాపుగా 60కోట్ల బడ్జెట్ అయినట్లు సమాచారం. 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రం పేరు చెప్పి ఈ చిత్రాన్ని తెలుగులో కూడా భారీ రేట్లకు అమ్ముతున్నారు. అయితే ఇటీవల నాగ్ 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రం గురించి మాట్లాడుతూ... ఈ చిత్రం 50కోట్లకు పైగా షేర్‌ను సంపాదించింది. దానిలో సగం కంటే తక్కువ బడ్జెట్‌తో అంటే 20కోట్లలోపు ఈ చిత్రాన్ని నిర్మించాం. ఇలాంటి లాభాలు వస్తేనే సినిమా హిట్ అని భావించాలి. 50కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన చిత్రం 50కోట్లు వసూలు చేసినా ఎవ్వరికీ లాభం ఉండదు అని వ్యాఖ్యానించాడు. ఆ లెక్కన 'ఊపిరి'కి 60కోట్ల బడ్జెట్ ఖర్చు కావడంతో మరి నాగ్ మాటల ప్రకారం ఈ చిత్రం 100కోట్లు సంపాదిస్తేనే హిట్ కింద లెక్కవేయాలి. అది సాద్యం కాకపోతే ఈ చిత్రం తీయడం వల్ల ఎవ్వరికీ లాభం ఉండదనే విషయం స్పష్టం అవుతుందని నాగ్ వ్యాఖ్యలను ఆయనకే ఆపాదిస్తూ కొందరు సెటైర్లు వేస్తున్నారు.