ప్రస్తుతం మంచి కథాబలం, విభిన్నమైన కథనం ఉన్న చిన్నచిత్రాలకు మంచి క్రేజ్ వస్తోంది. కథలో కొత్తదనం ఉంటే ప్రేక్షకులు చిన్న సినిమాలకు కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు. లోబడ్జెట్‌లో రూపొందే ఇలాంటి చిత్రాలు పెట్టుబడికి రెండు మూడు రెట్లు లాభాలను ఆర్జించి పెడుతున్నాయి. దీంతో అల్లుఅరవింద్, యువి క్రియేషన్స్, సుకుమార్, దిల్‌రాజు వంటి పెద్ద నిర్మాతలు కూడా చిన్న సినిమాలపై మక్కువ చూపుతున్నారు. తాజాగా మరో భారీ ప్రాడ్యూసర్ అదే రూటులో చిన్న సినిమాలు తీయడానికి సన్నద్ధం అవుతున్నాడని సమాచారం. తన కెరీర్‌లో ఎక్కువ శాతం భారీ చిత్రాలనే నిర్మించిన బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ రిలయన్స్ సంస్థతో కలిసి ఇకపై ఏడాదికి రెండు మూడు చిన్న సినిమాలను నిర్మించేందుకు సిద్దం అవుతున్నాడని సమాచారం. ఏడాదికో, రెండేళ్లకో ఒక భారీ చిత్రం చేయడం కంటే ఏడాదికి మూడునాలుగు చిన్న సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు, అలాగని కేవలం చిన్న సినిమాలే గాక స్టార్‌హీరోలతో కూడా పెద్ద చిత్రాలను సైతం ఏకకాలంలో నిర్మించేందుకు 'ఛత్రపతి' ప్రసాద్ సిద్దం అవుతున్నాడు. కానీ చిన్న సినిమాలకు మాత్రం నిర్మాణ బాధ్యతలు తన కుమారుడు బాపినీడు చేతిలో పెట్టనున్నాడని సమాచారం.