హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఓ డప్పేసుకున్నంత మాత్రాన ఫ్లాప్ సినిమాలు హిట్టయిపోవు, హిట్టులు ఫ్లాప్ అయిపోవు. ఎందుకంటే అన్నింటికీ అల్టిమేట్ న్యాయ నిర్ణేతలు ప్రేక్షకులే కాబట్టి, వాళ్ళు అన్నీ గమనిస్తూనే ఉంటారు. ఈ మధ్య కాలంలో ప్రతి సినిమాను హిట్టని చెప్పేసుకోవడం, విజయోత్సవాలు పెట్టేసుకోవడం పరిపాటి అయిపొయింది. తీరా చూస్తే వారం పది రోజులు తిరక్క ముందే ఆ ఫలానా చిత్రం ఎక్కడ ఆడుతుంది అంటే, ఒక్క ధియేటర్లో కూడా నిలబడదు. ఇటువంటి మాయా ప్రపంచంలో దర్శకుడు కుమార్ నాగేంద్రలాగా మాట్లాడే వారు దొరికితే విచిత్రంగానే అనిపిస్తుంది మరి. తుంటరితో రేపు మన ముందుకు రాబోతున్న ఈ దర్శకుడికి ఇది మూడో సినిమా. గుండెల్లో గోదారి, జోరు లాంటి ఫ్లాప్ మూవీస్ తీసానని మీడియా ముందు ఒప్పేసుకుంటున్నాడట ఈయన.
నేనేమీ కళా ఖండాలు, గొప్ప సినిమాలు తీయలేదు, ఇంతకు మునుపు రెండు ఫ్లాప్ సినిమాలు తీసాను. తుంటరి నా మూడో చిత్రం. నిర్మాతలను ఇబ్బంది పెట్టకూడదన్న ఒకే ఒక కారణంతో తమిళంలో హిట్టయిన మాన్ కరాటేను తెలుగులో రీమేక్ చేయడానికి ఒప్పుకున్నాను లేకపోతే డైరెక్ట్ తెలుగు సినిమాలు చేస్తేనే నేను కిక్కు ఫీలయ్యేది అంటూ నిజాయితీగా పాత్రికేయుల ముందు చెప్పడం గొప్ప విషయమే. కాకపోతే తన స్థాయికి ఇంతకన్నా గొప్ప సినిమాలు తీయగలనని, అన్నీ కుదిరితే తుంటరితో హిట్టు కొట్టాక పెద్ద కాన్వాస్ మీద మరింత పెద్ద చిత్రం చేసేందుకు సిద్ధమవుతానని చెప్పాడంట.