వెబ్ సైట్స్... అవి రాసే న్యూస్, న్యూసెన్స్... రివ్యూలు, రేటింగులు... ఎనాలిసిస్, గాసిప్స్... ఇలా అంతర్జాలం పుణ్యమాని వెబ్ సైట్స్ మాయాజాలం సినిమా పరిశ్రమ మీద ఎక్కువగా ఉంది. అందుకే ఎంతలా అవునన్నా, ఎవరు కాదన్నా చివరాఖరు రిలీజ్ టైంకి వచ్చేసరికి ఓ సినిమా ప్రమోషన్స్ విషయంలో ఈ వెబ్ సైట్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి అన్నది నిరూపించబడిన నిజం. దీనికి విరుద్ధంగా నిర్మాత దిల్ రాజు గారు మాత్రం మొన్న కృష్ణాష్టమి విషయంలో సినిమా బాగుంటే చూస్తారు, మీ రివ్యూలు గట్రా జనాలు పట్టించుకోరు అంటూనే తన సినిమాకు తన వైపు నుండి 3.25 రేటింగ్ వేసుకొని అటు తర్వాత భంగపడ్డారు. సునీల్ నటించిన ఈ మూవీ వర్డిక్ట్ సరిగ్గా వెబ్ సైట్స్ ఎలాగైతే సూచించాయో అదే దారిలో నడించింది. ఇక దిల్ రాజు గారు చెప్పిన దానితో పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడారు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గారు. మంచు మనోజ్ నటించిన శౌర్య చిత్ర సక్సెస్ మీటులో వెబ్ సైట్ రివ్యూల, రేటింగుల పై స్పందిస్తూ కొన్ని వెబ్ సైట్లలో మా చిత్రానికి 2, 2.25 రేటింగ్స్ ఇచ్చారు. ఈ రివ్యూలను ఫాలో అయి సినిమాకు వెళ్ళే వారు, ఆగిపోయే వారు చాలా మంది ఉంటారు అంటూ తనకు తెలిసిన బాష్యం చెప్పారు. కొత్త ప్రయోగాలు చేసినపుడు ప్రోత్సహిస్తేనే మనకు కొత్త సినిమాలు వస్తాయి అంటూ ప్రకాష్ రాజ్ గారు ముక్తాయింపును కూడా ఇచ్చారు. అటు దిల్ రాజు ఏం చెప్పినా, ఇటు ప్రకాష్ రాజ్ ఎలా విశ్లేషించినా అసలు విషయం మనకు తెలియనిదా?