ఏప్రిల్ 1 నుండి బాక్సాఫీస్ దగ్గర వేసవి సందడి మొదలవుతుంది అనడం తప్పవుతుంది. ఎందుకంటే అక్కినేని నాగార్జున, కార్తీ హీరోలుగా, తమన్నా హీరోయినుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఊపిరి అన్నింటికన్నా ముందే లైన్లో నిలబడి ఈనెల 25న మన ముందుకు రానుంది. అంటే బ్రహత్తరమైన సమ్మర్ సీజన్ హడావిడికి PVP వారు ఊపిరితోనే శ్రీకారం చుడుతున్నారు. అటు తరువాత సుప్రీం, సర్దార్ గబ్బర్ సింగ్, సరైనోడు, బ్రహ్మోత్సవం, బాబు బంగారం... ఇలా వరసపెట్టి ఆగస్ట్ వరకు ఎడతెరపి లేకుండా మనకు బడా సినిమాల పండగే పండగ. ది ఇన్-టచెబుల్స్ అనే ఫ్రెంచ్ మూవీ ఆధారంగా తీసిన ఊపిరి సినిమా నాగార్జున కెరీర్లోనే అత్యున్నతమైన చిత్రాలలో ఒకటిగా చెబుతున్నారు. ఇంతటి విశిష్టతను సంతరించుకున్నది కాబట్టే సమ్మర్ సీజనుకి ఇది సూపర్ ఓపెనింగ్ చేయనుంది. ఇప్పటికే విడుదలయిన ట్రైలర్, పాటలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.