దాదాపు 'కొచ్చాడయాన్' వరకు రజనీకాంత్ సినిమా అంటే కనీసం రెండేళ్లకు గానీ షూటింగ్ పూర్తయ్యేది కాదు. కానీ 'లింగా' చిత్రం తర్వాత రజనీ పూర్తిగా మారిపోయాడు. ఈ చిత్రాన్ని ఆయన అత్యంత వేగంగా కేవలం ఐదునెలలో పూర్తి చేశాడు. సినిమా డిజాస్టర్‌గా నిలిచినప్పటికీ 'లింగా' చిత్రం రజనీకి ఈ విషయంలో మంచినే చేసింది. 'లింగా' ఇచ్చిన స్ఫూర్తితో ఆయన తాజా చిత్రం 'కబాలి'ని కూడా ఐదునెలల్లోపే పూర్తి చేశాడు. రంజిత్ దర్శకత్వంలో కలైపులి థాను నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని గుమ్మడికాయ కొట్టేశారు. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరగుతున్నాయి. ఇప్పటివరకు ఆయన ఈ చిత్రం పోస్టర్స్ మాత్రమే రిలీజయ్యాయి. వీటిల్లో రజనీ స్టైల్‌ను చూస్తున్న వారు ఈ చిత్రం మరో 'బాషా' అవుతుందనే నమ్మకంతో ఉన్నారు. ఈచిత్రం ట్రైలర్‌ను, ఆడియోను ఏప్రిల్‌లో రిలీజ్ చేసి సినిమాను తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఇప్పటికే ఆయన స్టిల్స్‌ను, గెటప్‌ను చూసి బిజినెస్ సర్కిల్స్‌లో ఈ చిత్రం ప్రీరిలీజ్ బిజినెస్ అదరగొడుతోంది. ఈ చిత్రానికి తమిళనాట 120కోట్ల బిజినెస్ ఇప్పటికే జరిగిందని ట్రేడ్ వర్గాల సమాచారం. మలేషియా రైట్స్‌ను 10కోట్లకు, యూఎస్ రైట్స్‌ను 8.5కోట్లకు, ఆస్టేలియా రైట్స్ 1.65 కోట్లకు అమ్ముడుపోయాయి. తెలుగు వెర్షన్ రైట్స్‌ను 30కోట్లకు అడుగుతున్నట్లు సమాచారం. ఇలా రిలీజ్‌కు ముందే 150కోట్లకు పైగా బిజినెస్ జరిగిన ఈచిత్రం ట్రైలర్, ఆడియో విడుదలై ప్రమోషన్ మొదలుపెట్టిన తర్వాత ఈ బిజినెస్ రేంజ్ ఏస్తాయికి చేరుకుంటుందో? బిజినెస్‌పరంగా 'కబాలి' ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో అని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేయడంలో మునిగిపోయాయి. మొత్తానికి రజనీ రికార్డుల వేట మొదలైంది.