నిర్మాత బెల్లంకొండ సురేష్ అంటే ఒకప్పుడు నిర్మాతగా ఓ వెలుగు వెలిగాడు. కానీ ఆ తర్వాత ఆయన తీసిన పలు చిత్రాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి. దానికి తోడు తన కుమారుడు బెల్లకొండ సాయిశ్రీనివాస్‌ను హీరో చేయాలని ముచ్చటపడ్డాడు. అందుకోసం తన కొడుకు అరంగేట్రం మూవీ దర్శకత్వ బాధ్యతలను వినాయక్ వంటి స్టార్ డైరెక్టర్ చేతిలో పెట్టి భారీ రెమ్యూనరేషన్ ఇచ్చాడు. తొలి చిత్రంలోనే తన కుమారుడికి జోడీగా భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసి సమంతను హీరోయిన్‌గా, తమన్నా చేత ఐటం సాంగ్ చేయించి 'అల్లుడు శీను' చిత్రం కోసం డబ్బును నీళ్లలా ఖర్చుపెట్టాడు. ఈ చిత్రం ఫర్వాలేదనిపించుకున్నప్పటికీ బడ్జెట్ పరంగా చూసుకుంటే మాత్రం దాదాపు 20కోట్లు నష్టాలను తెచ్చిపెట్టింది. అయినా కూడా వెంటనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో సాయిచేత రెండో సినిమా తీయాలని ప్లాన్ చేశాడు. కానీ ఆర్ధిక కారణాల రీత్యా ఈ చిత్రం ఆగిపోయింది. ఆ తర్వాత భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తమిళ రీమేక్ 'సుందరపాండ్యన్' చిత్రాన్ని తెలుగులో 'స్పీడున్నోడు' చిత్రంగా చేయించాడు. పేరుకు ఈ చిత్రం నిర్మాత భీమనేనినే అయినా వెనక ఉండి పెట్టుబడి పెట్టింది మాత్రం బెల్లంకొండనే అనేది బహిరంగ రహస్యం. ఈ చిత్రం కూడా డిజాస్టర్‌గా నిలిచి భారీ నష్టాలను తీసుకొచ్చింది. దీంతో ఆయన ఒక్క సారిగా అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. ఫిల్మ్‌నగర్‌లోని ఆయన ఆఫీస్‌ను తనఖా పెట్టి కొటాక్‌మహాంద్రా బ్యాంకు నుండి 11కోట్లు రుణం తీసుకున్నాడు. దాన్ని తీర్చలేకపోవడంతో ఇటీవల ఆ కార్యాలయాన్ని బ్యాంక్ అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఆయన సినీ ఫీల్డ్‌లోని చాలామందికి, అలాగే సినీ ఫైనాన్షియర్స్‌కు భారీగా బాకీలు పడివున్నాడు. వీటికి సంబంధించిన సెటిల్‌మెంట్ వ్యవహారాలు కూడా జరుగుతున్నాయి. మొత్తానికి కొడుకును పెద్దస్టార్‌గా చూసుకోవాలని ఆశపడిన ఆయన కోరిక ఇప్పుడు ఆయనను పీకలలోతు నష్టాల్లో కూరుకుపోయేలా చేసింది. మరి ఈయన పరిస్థితి మరెంతమందికి జ్ఞానోదయం కలిగిస్తుందో చూడాల్సివుంది..!