'దేవదాసు, పోకిరి' చిత్రాలతో పాటు పలువురు స్టార్ హీరోల చిత్రాల్లో నటించి మెప్పించిన గోవా బ్యూటీ, నడుము సుందరి ఇలియానా. కాగా ఆమె తెలుగులో మంచి స్టేజీలో ఉన్నప్పుడే బాలీవుడ్‌పై అశలు పెంచుకుని అక్కడకు ఫ్లైట్ ఎక్కింది. 2012లో 'బర్ఫీ' ఘనవిజయంతో కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఈ అమ్మడు ఆ తర్వాత నాలుగేళ్లలో కేవలం మూడు చిత్రాలు మాత్రమే చేసింది. కానీ ఆమెకు ఒక్క విజయం దక్కలేదు. నూతన హీరోయిన్లతో ఎప్పుడూ కళకళలాడే బాలీవుడ్‌లో ఆమె నూతన తారల పోటీని తట్టుకోలేకపోతోంది. అవకాశాలు రాకపోవడం, చేసిన చిత్రాలు విజయం సాధించకపోవడంతో ఇక బాలీవుడ్‌లో కూడా ఆమె తెరమరుగయ్యే సమయం త్వరలోనే ఉందని అక్కడి సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా ఇప్పుడు ఈ అమ్మడు ఆశలన్నీ ఒకే ఒక్క చిత్రంపై ఉన్నాయి. అక్షయ్‌కుమార్ హీరోగా తెరకెక్కుతోన్న 'రుస్తుం' చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం బాలీవుడ్‌లో ఆమె కెరీర్‌కు కీలకంగా మారిందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఈ చిత్రం ఆగష్టు 12న విడుదల కానుంది. ఈ చిత్రం కూడా విజయం సాధించకపోతే ఇదే ఆమె చివరి చిత్రం అవుతుందని బాలీవుడ్ వర్గాల ఉవాచ.