నాగార్జున, అమల కలిసి నటించిన శివ చిత్రంలోని సరసాలు చాలు శ్రీవారూ.. వేళ కాదు అనే పాట ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. యాక్షన్ హీరోగా, రొమాంటిక్ హీరోగా, ఫ్యామిలీ హీరోగా, ఆధ్యాత్మిక చిత్రాల కథానాయకుడిగా అందరి అభిమానాన్ని చూరగొన్న నాగార్జునలో ప్రస్తుతం ఎక్కువగా రొమాంటిక్ యాంగిల్ కనిపిస్తోంది. దానికి ఉదాహరణగా సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాన్ని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో బలమైన కథంటూ ఏమీ లేకపోగా సినిమా మొత్తం హీరోయిన్లతో నాగార్జున ఆడిన సరసాలతో నిండిపోయిన విషయం తెలిసిందే. సంక్రాంతి సీజన్, ఫ్యామిలీ సినిమా అనే రెండు కారణాల వల్ల ఈ సినిమా నాగార్జునను 50 కోట్ల క్లబ్ హీరోని చేసేసింది.
సినిమా విషయం పక్కన పెడితే ఇప్పుడు నాగార్జున స్టేజ్ మీదే సరసాలు మొదలు పెట్టేశాడు. సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంలో ఒక స్పెషల్ క్యారెక్టర్ చేసిన అనసూయ ఊపిరి ఆడియో ఫంక్షన్‌కు సుమతో కలిసి వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఈ ఫంక్షన్‌లో నాగార్జున మాట్లాడుతూ అనసూయను ఉద్దేశించి కొన్ని రొమాంటిక్ డైలాగ్స్ విసిరాడు. దానికి అమలతో సహా అందరూ హర్షధ్వానాలు చేశారు. అంతటితో ఆగకుండా ఈ సినిమాలో తాను వీల్ చైర్‌కే పరిమితమయ్యానని, రొమాన్స్ చేసే అవకాశమే లేకుండా పోయిందని బాధపడ్డాడు. కార్తీ, తమన్నా తన ఎదురుగానే డాన్సులు చేస్తుంటే కోపం వచ్చిందని చెప్పాడు. ఈ సినిమాలో తను తమన్నాతో కలిసి నటించలేకపోయానని బాధగా వుందన్నాడు. ఇదంతా చూస్తుంటే వయసు పెరుగుతున్న కొద్దీ నాగార్జునలోని రొమాంటిక్ యాంగిల్ విజృంభిస్తున్నట్టు కనిపిస్తోంది. పబ్లిక్ ఫంక్షన్ అని కూడా చూసుకోకుండా హీరోయిన్ల గురించి రొమాంటిక్‌గా మాట్లాడుతూ తన కోరిక తీర్చుకుంటున్నాడు. స్టేజ్ మీద ఇంత జరుగుతున్నా అలా చూస్తూ వుండిపోయింది తప్ప భర్తను మాత్రం సరసాలు చాలు శ్రీవారూ అంటూ వారించలేకపోయింది అమల.