స్టార్ డైరెక్టర్ వినాయక్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా ఎంట్రీ గ్రాండ్‌గానే జరిగింది. ఈ చిత్రానికి విడుదలకు ముందు విపరీతమైన హైప్ వచ్చింది. అఖిల్ తొలి చిత్రం కావడంతో ఆయన తండ్రి నాగార్జున సైతం ఈ చిత్రం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకున్నాడు. కానీ అవేమీ సరైన ఫలితాలను అందించలేదు. ఈ చిత్రం విడుదల తర్వాత డిజాస్టర్‌గా నిలవడంతో హైప్ మొత్తం గాలికి కొట్టుకుపోయి విమర్శలు మొదలయ్యాయి. ఈ చిత్రం ఘోరంగా డిజాస్టర్ కావడానికి కొన్ని అతిపోకడలే కారణమనే నిర్ణయానికి నాగ్ వచ్చాడు. అందుకే అఖిల్ రెండో చిత్రం విషయంలో ఆయన మొదటి సినిమాలో జరిగిన పొరపాట్లకు తావివ్వకూడదనే నిర్ణయానికి వచ్చాడు. కాగా అఖిల్ రెండో చిత్రానికి దర్శకునిగా నాగ్ వంశీపైడిపల్లిని ఎంపిక చేశాడని సమాచారం. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో నాగ్ 'ఊపిరి' సినిమా చేస్తున్నాడు. ఏప్రిల్ రెండో వారంలో ఈ చిత్రానికి ముహూర్తంగా నిర్ణయించారని సమాచారం. 'ఊపిరి' విషయంలో వంశీపైడిపల్లి వర్క్‌కు ఇంప్రెస్ అయిన నాగ్ తన రెండో కుమారుడు అఖిల్‌కు మంచి హిట్ ఇచ్చి మరలా ఫామ్‌లోకి తెచ్చే సత్తా ఆయనలో ఉందనే నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.