నిర్మాతలకు అనవసరంగా డబ్బింగ్ ఖర్చులు తగ్గించడానికి, నిర్మాతల బ్యాంక్ బ్యాలెన్స్‌లను పెంచడానికి మన స్టార్‌హీరోయిన్లు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇటీవల వచ్చిన 'నాన్నకు ప్రేమతో' చిత్రంలో హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్ ఓన్‌గా డబ్బింగ్ చెప్పింది. తన రాబోయే చిత్రాల్లో కూడా దర్శకనిర్మాతలు ఓకే అంటే తనే సొంతగా డబ్బింగ్ చెప్పుకోవడానికి రెడీ అని ప్రకటించేసింది ఆమె. ఇక తమిళంలో విజయ్ హీరోగా వచ్చిన 'పులి' చిత్రంలో తన పాత్రకు శృతిహాసన్ ఓన్‌గా డబ్బింగ్ చెప్పుకొంది. బాలీవుడ్ చిత్రాలకు కూడా శృతి ఓన్‌గానే డబ్బింగ్ చెప్పుకొంటోంది. అలాగే తెలుగులో కూడా తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకొనే అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఇక కమల్‌హాసన్‌తో త్రిష కలిసి నటించిన 'తూంగావనం' చిత్రానికి త్రిష ఓన్‌గా డబ్బింగ్ చెప్పుకొంది. విక్రమ్-సమంత జోడీగా నటించిన '10ఎంద్రాకుల్లా' చిత్రంలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకొంది స్టార్‌హీరోయిన్ సమంత. త్వరలో విజయ్ హీరోగా రానున్న 'తేరీ' చిత్రానికి కూడా ఆమే డబ్బింగ్ చెప్పుకొంది. కాగా ఆమెకు తెలుగులో కొంతకాలంగా చిన్మయి డబ్బింగ్ చెబుతూ వస్తోంది. దర్శకనిర్మాతలు ఓకే అంటే తెలుగులో సైతం తానే డబ్బింగ్ చెప్పుకుంటానని ఈ అమ్మడు అంటోంది. మరో స్టార్‌హీరోయిన్ తమన్నా విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె నాగార్జున-కార్తిల కాంబినేషన్‌లో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న 'ఊపిరి' చిత్రం రెండు భాషల్లోనే ఇదే అమ్మడు డబ్బింగ్ చెప్పుకోనుంది. మొత్తానికి మన స్టార్‌హీరోయిన్లు డబ్బింగ్ క్రెడిట్ వేరే ఎవరికో ఇవ్వకుండా అందుకు తామే ముందుకు రావడం ఆహ్వానించదగిన విషయం.