బాలకృష్ణ తన వందో చిత్రంపై నిర్ణయానికి వచ్చేసినట్టే ఉన్నాడు. కృష్ణవంశీ చెప్పిన కథకే ఆయన పచ్చజెండా ఊపాడని పక్కాగా నిర్ధారిస్తున్నాయి నందమూరి కాంపౌండ్ వర్గాలు. ఇక కృష్ణవంశీ తన దగ్గరున్న లైన్‌ని స్క్రిప్టుగా మార్చేయడమే ఆలస్యం. ఆ పనులకి మరో నాలుగైదు నెలలు సమయం పట్టే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. మే నెలలో ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కృష్ణవంశీ బాలయ్యని రైతుగా చూపించాలనే ఆలోచనలో ఉన్నాడన్న విషయం మనకు తెలిసిందే. మనదైన నేపథ్యాన్ని, సంస్కృతిని తెరపై చూపించడంలో కృష్ణవంశీకి తిరుగులేదు. ఆయన రైతు కథతో సినిమా చేస్తున్నాడంటే ఇక అందులో నేటివిటీ ఎంత బలంగా ఉంటుందో ఊహించొచ్చు. రైతుల గురించి ఇటీవల కాలంలో సినిమాలు తీసిన దర్శకులెవ్వరూ లేరు. అందుకే ఆ కోణంపై దృష్టిపెట్టి కృష్ణవంశీ ఓ లైన్ అనుకొన్నాడు. ఆయన ఆ విషయం దగ్గరే సగం సక్సెస్ అయినట్టు అర్థమవుతోంది. బాలకృష్ణకి కూడా ఆ పాయింటే నచ్చిందట. అందుకే మరో మాట లేకుండా సినిమా చేయడానికి పచ్చజెండా ఊపేశాడని తెలిసింది. విశ్వసనీయ సమాచారంమేరకు ఈ సినిమాకి పేరు కూడా 'రైతు రాజ్యం' అనే ఫిక్స్ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. అచ్చమైన తెలుగు నేపథ్యంతో కూడిన చిత్రం కాబట్టి పేరు కూడా అందుకు తగ్గట్టుగానే ఉండాలని, రైతు రాజ్యం అనే పేరు నిర్ణయించినా.. నాకు ఏమాత్రం అభ్యంతరం లేదని, అయినా మనకు అంతకుమించిన పేరు ఇంకేముంటుంది? అని బాలకృష్ణ చిత్రబృందంతో వ్యాఖ్యానించినట్టు తెలిసింది.