అఖిల్ సినిమా నిర్మాణంతోనూ, త్రివిక్రమ్‌తో చేస్తున్న 'అఆ' ఆలస్యమవడంతోనూ నితిన్‌కి పర్సనల్‌గా చాలా సమయం వృథా అయ్యింది. కథానాయకుడిగా జోరు మీదున్న టైమ్‌లోనే ఇలా తన సమయం వృథా అవడంతో ఫీల్ అవుతున్నాడట నితిన్. ఇక నుంచి అలా రిపీట్ కాకుండా వేగంగా సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యాడు. ఆ మేరకు నాలుగైదు కథల్ని లైన్లో పెట్టినట్టు తెలుస్తోంది. 'నేను శైలజ' ఫేమ్ కిషోర్ తిరుమలతో ఓ చిత్రం, కృష్ణచైతన్యతో ఓ చిత్రం, ఇంకా ఇద్దరు కొత్త దర్శకులతోనూ రెండు సినిమాలు చేయడానికి ఒప్పుకొన్నారు. అయితే వాటితోపాటు ఇప్పుడు మరో చిత్రానికి కూడా నితిన్ పచ్చజెండా ఊపాడని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. తనతో 'గుండె జారి గల్లంతయ్యిందే' లాంటి హిట్టు సినిమాని తీసిన విజయ్‌కుమార్ కొండాతో మరో చిత్రం చేయడానికి నితిన్ ఒప్పుకొన్నట్టు తెలిసింది. విజయ్ కుమార్ కొండా ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్‌తో సినిమా చేస్తున్నాడు. అది పూర్తవ్వగానే నితిన్‌తోనే సినిమా చేయబోతున్నాడట. ఆ మేరకు ఇటీవలే కథ వినిపించి ఓకే చేయించుకున్నట్టు తెలిసింది. ఈ కథని 'గుండెజారి గల్లంతయ్యిందే'కి పనిచేసిన క్యాస్ట్ అండ్ క్రూతోనే తీయాలని విజయ్ కుమార్ కొండా భావిస్తున్నాడట. అంటే మళ్లీ నితిన్, నిత్య కలిసి నటిస్తారన్నమాట. ఇష్క్ నుంచి హిట్టు కాంబినేషన్‌గా గుర్తింపు తెచ్చుకొన్నారు వీళ్లిద్దరూ. నిత్య మీనన్ ఇటీవల బోలెడన్ని సినిమాలతో బిజీగా గడుపుతోంది. మరి నితిన్ సినిమాని ఒప్పుకుంటుందో లేదో చూడాలి.