అత్యంత భారీ బడ్జెట్ తోనూ, భారీతారాగణంతోనూ 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం తెరకెక్కుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ నాయికగా నటిస్తూండగా, శరద్ కేల్కర్ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నాడు. బ్రహ్మానందం, అలీ, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, ముకేశ్ రుషి, కబీర్ సింగ్, కృష్ణభగవాన్, బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్, ఊర్వశి, లక్ష్మీరాయ్, రఘుబాబు తదితరులు ఇతర నటీనటులు.
ఇందులో 'హార్స్ మేళా' సన్నివేశం చిత్రానికే ఎస్సెట్ గా నిలవనుంది. ఈ మేళాలో 100 గుర్రాలు, నూరుమంది అశ్వికులు, చిత్రంలోని 40 మంది ప్రధానతారాగణం, 1000 మంది జనం పాల్గొనగా, మూడు యూనిట్స్ తో ఈ సన్నివేశాన్ని అత్యంత భారీగా చిత్రీకరించారు. గుర్రాలతో పాటు కొన్ని పురాతన కార్లను, అధునాతన కార్లను కూడా చిత్రీకరణలో ఉపయోగించడం జరిగింది. అత్యంత భారీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో సాంకేతిక విలువలకు కూడా పెద్ద పీట వేయడం జరిగింది. అత్యుత్తమ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేశారు. హైదరాబాద్, బరోడా, రాజ్ కోట, కేరళ, మల్ షేట్స్ ఘాట్స్, మహారాష్ట్ర తదితర ప్రదేశాల్లో ఈ సినిమా చిత్రీకరణ సాగింది. మార్చి మాసం మధ్యలో ఆడియోను విడుదల చేసి, ఏప్రిల్ 8న 'సర్దార్ గబ్బర్ సింగ్'ను ప్రేక్షకుల ముందు నిలిపేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్, ఈరోస్ ఇంటర్నేషనల్ పతాకాలపై సంయుక్తంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శరత్ మరార్, సునీల్ లుల్లా నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫి: ఆర్థర్ విల్సన్, ఆండ్రూ, సంభాషణలు; సాయిమాధవ్ బుర్రా ;ఎడిటింగ్: గౌతమ్ రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, దర్శకత్వం:కె.రవీంద్ర (బాబీ).