ఇందాకే చెప్పుకున్నట్లుగా సినిమా అనేది ఫక్తు ఓ వ్యాపారం. ఇక్కడ అంతిమ లక్ష్యం డబ్బులే. ఓ సినిమా ఆడిందా, ఆడలేదా అన్న లెక్క అది కలెక్ట్ చేసిన షేర్ రూపంలోనే దాగి ఉంటుంది. డబ్బులు వచ్చాయంటే సినిమా ఆడిందని అర్థం లేదంటే పోయిందన్నట్టు. అందుకే ఇక్కడ ఆడే ఆటలు ఏదో కళ మీద ఉన్న తపనతోనే, కళాకారుడిగా ఇంకేదో చేసేయాలన్న కసితోనో ముడి పెట్టకూడదు. ఈ విషయంలో దిల్ రాజు గారు ఓ మంచి మాటను చెప్పుకొచ్చారు. ఈ మధ్య అల్లు అరవింద్ గారుతో పిచ్చాపాటీ మాట్లాడుతుంటే దిల్ రాజు గారితో ఆయన ఓ మాట అన్నారట. ఒకానొక సమయంలో కళ మీదున్న గౌరవంతో కళాకారులు పని చేసే వాళ్ళు. వాళ్ళ వాళ్ళ పారితోషికాలు పెంచాలన్నా కూడా డబ్బుల కన్నా కళ మీదున్న మమకారమే ముందు వచ్చేది. అంటే అప్పుడు కళ ఫస్ట్, డబ్బులు అనేవి సెకండ్ ఇంపార్టెన్స్. మరి ఇప్పుడు డబ్బులు ఫస్ట్, కళ అనేది సెకండ్ ఇంపార్టెన్స్ స్థాయికి వచ్చేసాం. ఎవరో ఒకరిని తప్పు పట్టడానికో ఈ మాటలు చెప్పట్లేదు, అందరూ అలాగే ఉన్నారని దిల్ రాజు గారు నేటి సినిమా ఇండస్ట్రీ పరిస్థితిని ఒక్క మాటలో చెప్పేశారు. ఒకటే బండ సూత్రం. జనరంజకంగా ఉన్నదే కళ కానీ కళాకారుడు ఇష్టపడి చేసేది కళ కాదు.