సూపర్ స్టార్ కృష్ణకు ఉన్న అశేష అభిమాన ఘనం అప్పట్లో మరే హీరోకు కూడా లేదు. ఇప్పుడు ఆ ఫాలోయింగ్ మొత్తం మహేష్ బాబుకు హోల్ సేలుగా వచ్చేసినా, ఇప్పటికీ కృష్ణ గారిని వెండి తెర మీద చూడాలన్న కోరిక ఎందరికో ఉంది. నెంబర్ వన్, అమ్మ దొంగా లాంటి చిత్రాలతో కొంత కాలం కిందట మళ్ళీ ఫాంలోకి వచ్చినట్టు కనపడ్డ కృష్ణ అటు తరువాత మహేష్ బాబు రాణించడం చూస్తూ గర్వంగా పక్కనే ఉంది పులకించిపోయారు. ఎందుకో మరి ముప్పలనేని శివ తీసుకొచ్చిన శ్రీశ్రీ కథలో గొప్పదనం కనిపించి మళ్ళీ ముఖానికి రంగు వేసుకున్నారు. తొందరలోనే మహేష్ బాబు చేతుల మీదుగా పాటల పండగ జరుపుకోబోతున్న ఈ చిత్రం తాలూకు కొన్ని కొత్త ప్రచార చిత్రాలు మార్కెట్టులో విడుదల అయ్యాయి. నిజ జీవితంలో భార్యా భర్తలుగా ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచిన విజయ నిర్మల, కృష్ణలు ఇదిగో పైన చూస్తున్నారుగా శ్రీశ్రీ సినిమాలో కూడా భార్యా భర్తలుగా నటించడం చూసేవారికి, మరీ ముఖ్యంగా అభిమానులకు పండగలాగా ఉంది. సినిమా సంగతి ఎలా ఉన్నా, కృష్ణను ఇలా తిలకించడం కొత్త అనుభూతినిస్తుంది. కాదంటారా...