బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆరంగేట్రం ఏ స్టార్ హీరో కొడుకు అయినా అసాధ్యం అనే స్థాయిలో ఒక కలలాగా సాగింది. అల్లుడు శీనుకు ఖర్చు పెట్టిన ప్రతి పైసా తెర మీద కనపడేట్టు చేసారు దర్శకుడు వీవీ వినాయక్. అటు తరువాత ప్రమోషన్స్ విషయంలో కూడా బెల్లంకొండ సురేష్ గారి చేయికి ఎముక లేదా అన్న చందంగా అనిపించాయి. ఇక ఫస్ట్ సినిమాతో మంచి మార్కులు వేయించుకున్న సాయి వసూళ్ళ పరంగా కూడా అల్లుడు శీనును రామ్ చరణ్ చిరుతకు దీటుగా నిలిపాడు. అందుకే రెండో చిత్రం స్పీడున్నోడుకు వచ్చేసరికి అందరికీ చిత్రం బాగుంటుందేమో అన్న ఆశ కలిగింది. నిజానికి అల్లుడు శీను మొత్తంగా నష్టాలే మిగిల్చినప్పటికీ, సాయికి మంచి పేరు రావడంతో అనుకున్న ప్లాన్ వర్క్ అవుట్ అయినట్టే అనుకున్నారు. కానీ అదే స్పీడున్నోడు విషయంలో మాత్రం అన్నింటా తప్పుల తడకయింది. శనివారం, ఆదివారం కలెక్షన్స్ అనుకున్న స్థాయిలో లేకపోవడం, ఇక సోమవారం నుండి మరింతగా డ్రాప్ అవడం చూస్తుంటే ఎట్లా కాదన్నా మొత్తంగా పది నుండి పదిహేను కోట్ల పై మొత్తంలోనే బయ్యర్లకు, నిర్మాతలు లాస్ తప్పదన్న అంచనాకు వచ్చేసాయి ట్రేడ్ వర్గాలు.