రాఘవేంద్ర రావు గారంటే ట్రెండుతో, జోనరుతో సంబంధం లేకుండా ఏ కథనిచ్చినా, ఏ హీరోనిచ్చినా తనదైన శైలిలో చుట్టి పక్కనేస్తారనే విషయం మనకు తెలిసిందే. కానీ మరీ కొత్తగా కుర్రాడు రాజ్ తరుణ్ హీరోగా రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో ఓ సినిమా మొదలవనుంది అన్న వార్త వింతగా వినిపించింది, అనిపించింది. ప్రస్తుతానికి KRR గారంటే ఏ భక్తిరస ప్రాధాన్యం ఉన్న కథలకో బాగుంటారు కానీ ఇలా శతమానం భవతి అనే ఓ ఫ్యామిలీ సెలెబ్రేషన్ సౌండింగ్ ఉన్న కథని ఒకప్పటి శైలిలో కాకుండా మాడరన్ జనాన్ని ఆకట్టుకునే రీతిలో ప్రెజెంట్ చేయగలరా అన్న అనుమానం సినీ జనాల్లో వినబడుతోంది. అక్కినేని నాగార్జునతో హాథిరామ్ బాబా కథని రాఘవేంద్ర రావు గారు సినిమాగా తీస్తున్నారు అంటే వినసొంపుగా ఫీలయిన ఆడియెన్సు శతమానం భవతి విత్ రాజ్ తరుణ్ అనగానే కాస్తంత షాకుకు లోనయ్యారు. అంత గొప్ప దర్శకుడితో పని చేయడం రాజ్ తరుణ్ పాలిట అదృష్టంగానే అనిపించినా, సీతమ్మ అందాలు సినిమాతో ఫ్లాప్ రుచి మొదటిసారి చవిచూసిన ఈ హీరో ఆచితూచి అడుగులు వేయాల్సిన సమయంలో తీసుకున్న ఈ నిర్ణయం సముచితంగా మాత్రం లేదనే విమర్శలు కూడా వినపడుతున్నాయి.