అనుష్కతో సైజ్‌జీరో చిత్రాన్ని నిర్మించి అన్నివిధాలా నష్టపోయిన పివిపి ఇప్పుడు క్షణం అనే ఎక్స్‌పెరిమెంటల్ మూవీతో రాబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ కూడా ఇటీవలే రిలీజ్ అయింది. ఇదిలా వుంటే ఈ సినిమా తర్వాత మరో పెద్ద రిస్క్ చెయ్యడానికి రెడీ అవుతున్నాడు పివిపి.
సాధారణంగా స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్లు ఇద్దరు లేదా ముగ్గురు వుంటారు. నాగార్జున, శ్రీను వైట్ల కాంబినేషన్‌లో వచ్చిన కింగ్ చిత్రంలోని ఒక స్పెషల్ సాంగ్‌లో ఎనిమిది మంది హీరోయిన్లు నాగార్జునతో చిందులేశారు. ఇప్పుడు పివిపి అంతకుమించి అన్నట్టుగా పది మంది హీరోయిన్లతో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఆ పది మంది హీరోయిన్లు ఇలా వచ్చి అలా వెళ్లిపోయేవారు కాదు, ఫుల్ లెంగ్త్ సినిమాలో ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తారట. సబ్జెక్ట్‌ని కూడా ఫైనల్ చేసిన పివిపి త్వరలోనే ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్ళబోతున్నాడు. ఒక టిపికల్ సబ్జెక్ట్‌తో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసే బాధ్యత ఎవరికి అప్పగిస్తే బాగుంటుందనే విషయంలో తర్జన భర్జనలు జరుగుతున్నాయట. ఓ కొత్త సంచలనానికి శ్రీకారం చుట్టబోతున్న ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం వుంది.