తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉత్సాహం, ఉత్సూకత కలిగి నేటి యువత మైండ్ సెట్ సరిగ్గా అర్థం చేసుకున్న దర్శకుల జాబితాలో శేఖర్ కమ్ముల పేరు ముందు వరసలో ఉంటుంది. హ్యాపీ డేస్ అన్న ఒక్క సినిమాతో ఈయన టాప్ రేంజుకి చేరిపోయారు. అటు తరువాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, అనామిక లాంటి ఫెయిల్యూర్లూ తీసినా శేఖర్ నుండి కొత్త సినిమా వస్తోంది అంటే వేచి చూసే వారి సంఖ్య మాత్రం తగ్గలేదు. అదీ అతని బ్రాండ్ వ్యాల్యూ. మహేష్ బాబుతో ఓ ప్రాజెక్టు ప్రపోజల్ దశలో ఉన్నప్పటికీ ప్రస్తుతానికి కమ్ముల మనసు మొత్తం హ్యాపీ డేస్ హిందీ రీమేక్ మీదే కేంద్రీకృతం అయి ఉంది. తెలుగు వారి సహజత్వానికి సరిగ్గా సరిపోయే CBIT క్యాంపస్ బ్యాక్ డ్రాప్ హ్యాపీ డేస్ కోసం ఎంచుకున్న కమ్ముల ఈసారి బాలివుడ్ కోసం IIT గౌహతి క్యాంపస్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కాలేజీలో చేసే అల్లరి, ప్రేమలు, కెరీర్ దృక్పదం, ఎమోషన్స్, స్నేహం... ఇలా అన్నిటి సమాహారమైన హ్యాపీ డేస్ నిజంగా యూనివర్సల్ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. క్యాంపస్ మారినా మనుషుల మధ్య భావోద్వేగాలను ఉన్నవి ఉన్నట్టుగా పరిచయం చేస్తే బాలివుడ్ ఏంటి హాలివుడ్ స్థాయిలో కూడా హ్యాపీ డేస్ హ్యాపీ ఫలితాన్నే ఇస్తుంది. మొత్తం మీద ఇక్కడ మునిగిన శేఖర్ కమ్ముల అక్కడెక్కడో అస్సాంలో తేలాడు.