ఇంతకాలం ఒకే భాషా చిత్రాలను చేస్తూ తమ మార్కెట్‌ను విస్తృతం చేసుకోవడంపై దృష్టి పెట్టని మన స్టార్ హీరోల ఆలోచనలు ఇప్పుడిప్పుడే మారుతున్నాయి. ఈ విషయంలో అందరికంటే ముందున్నాడు అల్లుఅర్జున్. ఆయన ఇప్పటికే తెలుగుతోపాటు మలయాళంలో కూడా మంచి క్రేజ్, ఇమేజ్ తెచ్చుకున్నాడు. తాజాగా ఆయన దృష్టి కోలీవుడ్ మార్కెట్‌పై పడింది. ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో 'సరైనోడు' చిత్రం చేస్తున్న బన్నీ ఆ తర్వాతి చిత్రాన్ని దర్శకుడు విక్రమ్.కె.కుమార్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ చిత్రాలను కూడా ఆయన తెలుగుతో పాటు మలయాళ, తమిళ భాషల్లో విడుదలకు ప్లాన్ చేస్తున్నాడు. ఇక తాజాగా బన్నీ ఏకంగా తెలుగు, తమిళ భాషల్లో ఓ ద్విభాషా చిత్రాన్ని చేయడానికి రెడీ అవుతున్నాడు. అది కూడా తమిళ కమర్షియల్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో. 'పందెంకోడి, ఆవారా, వెట్టై (తెలుగులో 'తడాఖా') వంటి కమర్షియల్ హిట్స్ తీసిన లింగుస్వామికి తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి క్రేజ్ ఉంది. కాగా ఆయన త్వరలో విశాల్ హీరోగా 'పందెంకోడి' సీక్వెల్ చేయనున్నాదు. అంతలోపు బన్నీ కూడా విక్రమ్ కుమార్ సినిమా పూర్తి చేసుకుంటాడు. ఆ వెంటనే లింగుస్వామి-అల్లుఅర్జున్‌ల కాంబినేషన్‌లో తెలుగు, తమిళ భాషల్లో భారీ ద్విభాషా చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు.