పవన్‌కళ్యాణ్ సినిమా సెట్‌కి అతిథుల తాకిడి పెరిగింది. పొలిటికల్ లీడర్స్‌తో పాటు... మెగా ఫ్యామిలీకి సంబంధించిన కథానాయకుల్లో ఎవరో ఒకరు తరచుగా ఆ సెట్‌కి వెళుతూనే ఉన్నారు. మొదట సాయిధరమ్ తేజ్ పవన్ సెట్లోకి వెళ్లి సందడి చేశాడు. బ్రూస్‌లీ విడుదల తర్వాత చరణ్ వెళ్లాడు. బన్నీ, ఆయన శ్రీమతి, తనయుడు కూడా ఒకసారి సెట్‌కి వెళ్లినట్టు తెలుస్తోంది. ఇటీవల చిరంజీవి కూడా సెట్లోకి వెళ్లారు. వెళ్లడమే కాదు... పవన్‌తో చాలాసేపు మాట్లాడి ఆ తర్వాత ఇద్దరూ కలిసి లంచ్ కూడా చేశారట. వీళ్లిద్దరితో పాటు చరణ్ కూడా అక్కడే ఉన్నాడని చిత్రవర్గాలు చెబుతున్నాయి.
పవన్‌కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న 'సర్దార్ గబ్బర్‌సింగ్' చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. చిరంజీవి ఇంటికి కూతవేటు దూరంలోనే ఆ సినిమా జరుగుతున్నట్టు తెలుస్తోంది. అందుకే చిరు అక్కడికి బాక్స్ తీసుకొని వెళ్లి మరీ తమ్ముడితో కలిసి లంచ్ చేశాడట. అక్కడ తీర్చిదిద్దిన రతన్‌పూర్ సెట్‌ని చూసి చిరు ముగ్ధుడయ్యాడట. ఆ సెట్టు ఐడియా ఇచ్చింది పవన్‌కళ్యాణే అని చిత్రబృందం చెప్పడంతో చిరు తన తమ్ముడిని అభినందించాడట. అనంతరం చిత్రబృందంతో కలిసి ఓ ఫొటో కూడా దిగాడు చిరు. అయితే అందులో చరణ్ మాత్రం లేడు. బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్దార్ గబ్బర్‌సింగ్ వేసవికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.