బాలీవుడ్ చిత్రాలతో సరిసమానంగా మన టాలీవుడ్ చిత్రాలు కూడా ఓవర్‌సీస్‌లో అద్భుతమైన కలెక్షన్లను సాధిస్తూ నిర్మాతలకు, బయ్యర్లకు లాభాల పంట పండిస్తున్నాయి. 'బాహుబలి' చిత్రం అక్కడ దాదాపు 40కోట్లు కొల్లగొట్టగా, 'శ్రీమంతుడు' చిత్రం 20కోట్లు వసూలు చేసింది. ఇక 'బాద్‌షా, టెంపర్' చిత్రాలతో ఓవర్‌సీస్‌లో మిలియన్ మార్కు అందుకున్న ఎన్టీఆర్ తాజా చిత్రం 'నాన్నకు ప్రేమతో' చిత్రం అక్కడ ఇప్పుడు కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రం రెండు మిలియన్ మార్క్‌ను క్రాస్ చేస్తోంది. ఇక 'భలే భలే మగాడివోయ్' చిత్రం కూడా అక్కడ మిలియన్ మార్క్‌ను దాటింది. 'రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రాలతో మిలియన్ మార్క్‌ను అందుకున్న అల్లుఅర్జున్ తాజా చిత్రం 'సరైనోడు' అక్కడ 7.5కోట్లకు అమ్ముడైంది. ఇక తెలుగు నాట సంచలన విజయం సాధిస్తోన్న 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రం ఇప్పటికే ఓవర్‌సీస్‌లో 5కోట్లను వసూలు చేసింది. ఇలా చూసుకుంటూ పోతే రాను రాను తెలుగు సినీ పరిశ్రమకు మరో నైజాంగా ఓవర్‌సీస్ మార్కెట్ నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.