లాంగ్ బ్రేక్ తీసుకున్నా మంచిదే గాని బెల్లంకొండ సురేష్ గారబ్బాయి సాయి శ్రీనివాస్ తనలో స్పీడు ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నాడు. వచ్చే నెలలో విడుదలకు సిద్ధమవుతున్న స్పీడున్నోడు చిత్రం మొత్తం సాయి భుజాల మీదే వేసుకున్నట్లు కనపడుతున్నాడు. భీమనేని శ్రీనివాస రావు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా యొక్క ట్రైలర్ మొన్న ఆడియో వేడుకలో రిలీజ్ అయినప్పటి నుండి చిత్రం మీద అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. మొదటి చిత్రం అల్లుడు శీనుతోనే తనలో అసలు సిసలైన సీన్ ఉందని నిరూపించుకున్న శీను ఈసారి కూడా డ్యాన్సుల్లో, పోరాటాల్లో విరుచుకు పడిపోయాడు. కాస్త టైం గ్యాప్ తరువాత దర్శకత్వం వహిస్తున్న భీమనేని కూడా ఈ సినిమా సూపర్ హిట్ గ్యారంటీ అన్న అభిప్రాయం వెలిబుచ్చారు. తమిళ చిత్రం సుందర పాండ్యన్ రీమేకుగా రానున్న స్పీడున్నోడు వచ్చే నెల మొదటి వారంలో గానీ రెండో వారంలో గానీ సినిమా హాళ్ళలో దిగనున్నాడు. వయసు ఇరవయ్యే గానీ వేగం మాత్రం నూట ఇరవై అనేలా కన్పిస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఏపాటి మీటర్ రీడింగ్ చూపెడుతుందో వేచి చూద్దాం.