బాలీవుడ్ స్టార్‌హీరోలైన సల్మాన్‌ఖాన్, షార్‌ఖ్‌ఖాన్‌లు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈసారి వీరిద్దరూ వివాదంలో ఇరుక్కున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది. కలర్స్ చానెల్‌లో రియాలిటీ షో బిగ్‌బాస్ కార్యక్రమం ప్రమోషన్‌లో కోసం బాలీవుడ్ స్టార్స్ సల్మాన్‌ఖాన్, షారుఖ్‌ఖాన్ కాళీ మందిరంలోకి షూలు వేసుకొని వెళ్లడంపై రగడ మొదలైంది. దీనిపై హిందు మహాసభ దాఖలు చేసిన పిటిషన్‌ను మీరట్ కోర్టు విచారణకు స్వీకరించింది. కలర్స్ చానెల్‌పైన కూడా విచారణ జరుగనుంది. 2015 డిసెంబర్‌లో ప్రసారమైన 'బిగ్ బాస్' కార్యక్రమం కోసం కాళీ మందిరం సెట్ వేసి ఈ ఇద్దరిపై షూట్ చేశారు. షూటింగ్ సమయంలో ఈ ఇద్దరు హీరోలు కాళ్లకు షూలు తొడుక్కొని ఉన్నారు. దేవాలయంలోకి షూలతో వెళ్లి హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ హిందూ మహాసభ నేత భారత్ రాజ్‌పుత్ ఈ పిటిషన్ దాఖలు చేశాడు. తొలుత చానెల్ దృష్టికి, పోలీసుల దృష్టికి ఈ విషయం తెచ్చినా వారు స్పందించకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. కార్యక్రమం దర్శకుడిపై కూడా పిటిషన్ దాఖలైంది. సల్మాన్, షారుఖ్‌ల మద్య చాలాకాలంగా మాటలు లేవు. ఈమధ్యనే ఈ ఇద్దరి మధ్య స్నేహం చిగురించింది. ప్రస్తుతం ఇద్దరూ బెస్ట్‌ఫ్రెండ్స్ అయ్యారు. ఒకరి సినిమాలను మరొకరు ప్రమోట్ చేస్తున్నారు. ఈసారి ఇద్దరు ఒకే వివాదంలో ఇరుక్కోడం హాట్‌టాపిక్ అయింది.