తన 99వ చిత్రం 'డిక్టేటర్' విడుదల సందర్భంగా ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్య మాట్లాడుతూ.. తన వారసుడు నందమూరి మోక్షజ్ఞ చేయబోయే తొలి సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. ఆయన మాట్లాడుతూ... మొదటి చిత్రంతోనే ప్రపంచాన్ని కాపాడే సూపర్‌హీరో పాత్రలు చేయకూడదని, ప్రేక్షకులందరూ మన అబ్బాయ్ అనుకొనే పాత్రలు చేస్తే, ఆ తర్వాత ఐదారుచిత్రాలకు మాస్ ఫాలోయింగ్ ఎలాగూ వస్తుంది.. అన్నాడు. ఇటీవలకాలంలో నాగార్జున వారసుడిగా అఖిల్ చేసిన 'అఖిల్' సినిమాలోని హీరో పాత్ర ప్రపంచానికి పొంచి ఉన్న విపత్తు నుండి కాపాడే సూపర్‌హీరో పాత్ర అన్నది తెలిసిన విషయమే. ఈమధ్యకాలంలో ఎవ్వరూ ఇలాంటి సూపర్ హీరో పాత్రలతో ఎంట్రీ ఇవ్వలేదు. కేవలం అఖిల్ మాత్రమే అలాంటి పాత్ర చేశాడు. దీంతో బాలయ్య చేసిన వ్యాఖ్య కేవలం నాగ్ తనయుడు అఖిల్‌ను దృష్టిలో పెట్టుకొని వేసిన సెటైర్‌గా అందరూ భావిస్తున్నారు. కాగా చాలాకాలంగా బాలయ్యకు, నాగ్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విభేదాలు ఉన్నాయి. హుద్‌హుధ్ తుఫాన్ బాధితుల కోసం చేసిన కార్యక్రమంలో ఈ ఇద్దరు ఒకే వేదికపై ఉన్నప్పటికీ ఇద్దరూ ఎడమొహం, పెడమొహంగానే ఉన్నారు. అప్పుడెప్పుడో తమ తమ చిత్రాలకు సంబంధించిన థియేటర్ల విషయంలో వీరిద్దరికీ తీవ్ర అభిప్రాయబేధాలు వచ్చిన సంగతి తెలిసిందే.