సంక్రాంతి సీజన్‌లో ఇద్దరు ముగ్గురుస్టార్స్ పోటీపడటం కామనే అయినా ఈసారి మాత్రం నందమూరి ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోలు పోటీకి సై అనడం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తిరేపుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో అయితే జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ బాలయ్య పోటీ టీడీపీ పార్టీలో పెద్ద చర్చకే దారితీస్తోంది. సంక్రాంతి బరిలో ఉండటంపై మొదట క్లారిటీ ఇవ్వని ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో' పొంగల్‌రేసులో 'డిక్టేటర్'తో ఢీ కొట్టడం ఖాయమని తేల్చేశాడు. దీంతో ఇప్పుడు 'డిక్టేటర్'కు 'నాన్నకు ప్రేమతో' కంటే ఎక్కువ థియేటర్లు దక్కేలా చేయడం కోసం ఏకంగా టీడీపీ యువనేత, చంద్రబాబు తనయుడు, బాలయ్య అల్లుడు లోకేష్ ప్రయత్నాలు మొదలుపెట్టాడని ప్రచారం సాగుతోంది. రాయలసీమతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 'నాన్నకు ప్రేమతో' సినిమాకు బుక్ అయిన థియేటర్లను బలవంతంగా 'డిక్టేటర్'కు షిఫ్ట్ చేస్తున్నారని సమాచారం. అయితే ఇందుకోసం ఏకంగా లోకేష్ రంగంలోకి దిగాడనే వార్తలు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిని రేపుతున్నాయి. మొత్తానికి ఈసారి 'డిక్టేటర్' వర్సెస్ 'నాన్నకు ప్రేమతో' సినిమాల మధ్యపోటీ కేవలం రెండు సినిమాల మద్య పోటీకి మాత్రమే పరిమితం అవుతున్నట్లు కనిపించడం లేదనే చర్చ జరుగుతోంది.