ఒకే ఒక్క కామెంట్ అమీర్‌ఖాన్‌ను వెంటాడుతోంది. 'అసహనం' అనే పదం వాడి అమీర్ అందరి ఆగ్రహానికి గురయ్యాడు. ఈ కామెంట్ ఆయన కొంపముంచింది. ఇప్పటివరకు ఇంక్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా అమీర్‌ఖాన్ 10ఏళ్ల ఎండార్స్‌మెంట్ చేసి ఉన్నాడు. 'అసహనం' కామెంట్స్ చినికి చినికి గాలివానగా మారినట్లు 'ఇంక్రెడిబుల్ ఇండియా' బ్రాండ్ అంబాసిడర్‌గా అమీర్‌ఖాన్‌ను తొలగించి అమీర్ స్థానంలో అమితాబ్‌బచ్చన్‌ను ఎంచుకొంది కేంద్రప్రభుత్వం. ఈ ఒక్కటే కాదు.. ఇప్పుడు పలు కార్పొరేట్ సంస్థలు అమీర్‌ను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకోవదానికి వెనకడుగు వేస్తున్నాయి. దీంతో 'సత్యమేవజయతే' వంటి వాటిలో కూడా అమీర్‌ను తొలగించే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. కేవలం యాడ్స్‌లో, బ్రాండ్ అంబాసిడర్‌గా మాత్రమే కాదు... దేశంలోని మెజార్టీ ప్రజల అభిప్రాయం ఘోరంగా దెబ్బతినేలా చేసిన అమీర్ వ్యాఖ్యల వల్ల ఆ ప్రభావం ఆయన సినిమాలపై, కలెక్షన్స్‌పై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక తమిళ యంగ్ మ్యూజిక్ సంచనలం అనిరుధ్ కూడా తాను చేసిన ఒకే ఒక్క తప్పుకు భారీ మూల్యం చెల్లించుకుంటున్నాడు. శింబు రాసిన బీప్‌సాంగ్‌కు అనిరుధ్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ధనుష్ సినిమా అంటే దానికి సంగీత దర్శకునిగా అనిరుధే ఉంటున్నాడు ఈమధ్య. 'త్రీ' చిత్రం నుండి ఒకటి అర సినిమాలకు తప్ప మిగిలిన చిత్రాలన్నింటికీ అనిరుధే సంగీతం అందిస్తు వస్తున్నాడు. వారిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలన్నీ మ్యూజికల్‌గా పెద్ద హిట్స్‌గా మిగిలాయి. బీప్ సాంగ్ మహిళలను కించపరిచే విధంగా ఉండటంతో తమిళనాడులోని మహిళా సంఘాలతో పాటు, మహిళా ప్రేక్షకులు కూడా శింబు, అనిరుధ్‌లపై తీవ్రమైన కోపంతో ఉన్నారు. తాజాగా బీప్‌సాంగ్ ఎఫెక్ట్ వల్ల అనిరుధ్‌కు ఓ అద్భుతమైన అవకాశం చేజారింది. ధనుష్ తాజాగా చేస్తున్న 'కోడి' చిత్రానికి అనిరుధే సంగీతం అందించాల్సి వుంది. కానీ ధనుష్ మాత్రం ఆయన్ను పెట్టుకుంటే లేనిపోని తలనొప్పులు, వివాదాలు చెలరేగుతాయని భావించి, ప్రస్తుతం రజనీకాంత్ నటిస్తున్న 'కబాలి' చిత్రానికి పనిచేస్తున్న సంతోష్ నారాయణ్‌ను తీసుకున్నాడు. ఇందులో ధనుష్ ద్విపాత్రాభినయం చేస్తుండగా, త్రిష, షామిలిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. దీంతో పాటు మరికొందరు దర్శకనిర్మాతలు కూడా బీప్ సాంగ్ వివాదం తర్వాత అనిరుధ్‌ను పక్కనపెట్టేసి వేరే సంగీత దర్శకులకు అవకాశం ఇస్తున్నారు. దీంతో అనిరుద్ కెరీర్ తీవ్ర సంక్షోభంలో పడింది.