నాలుక్కి నాలుగూ, ఇంకా సందు దొరికితే మరో డబ్బింగ్ సినిమా కూడా సంక్రాంతి బరిలో నిలవాలని ఉవ్విళ్ళూరుతోంది. మన తెలుగు సినిమాలైన నాన్నకు ప్రేమతో, డిక్టేటర్, ఎక్స్ ప్రెస్ రాజా, సోగ్గాడే చిన్ని నాయనల మధ్యనే ఇంకా థియేటర్ల పంపకాలు పూర్తవక ఆయా హీరోల అభిమానులు, నిర్మాతలు, బయ్యర్లు బిక్కుబిక్కుమంటూ రోజులు వెళ్ళదీస్తుంటే తమిళ హీరో విశాల్ నటించిన కథాకళి కూడా ఈ సీజన్లోనే విడుదల అవుతోంది అంటూ సమాచారం అందుతోంది. విశాల్ ఆరాటం దేనికంటే అటు తమిళం, ఇటు తెలుగులో ఒకేసారి రిలీజ్ అయిపోతే గొడవ వదిలిపోతుంది అని, అలాగే పండగ సెలవుల్లో బాక్సాఫీస్ పరంగా కూడా ఎక్కువ షేర్లు రాబట్ట వచ్చు అన్నది ప్లాన్. కానీ బడా తెలుగు హీరోల మధ్యలో ఓ అరవ హీరో, అదీ డబ్బింగ్ చేసి మరీ పోటీకి దిగితే ఇక్కడి నిర్మాతలు ఊరుకోరు అన్నది ఓ వాదన. అరవంలో ఈ సినిమాకు మంచి డిమాండ్ ఉంది. పైగా నడిగర్ సంఘం ఎన్నికల్లో విశాల్ సాధించిన విజయంతో కథాకళి పట్ల ఇంకొంచెం క్రేజ్ యాడ్ అయింది. మరి మన నాలుగింటి మధ్య విశాల్ కథాకళి చేస్తే ఆనుతుందా, అందుకే జాగ్రత్తగా ఓ వారం పది రోజులు వెనక్కి పోయే సూచనలు కూడా ఉన్నాయంటున్నారు.