సౌత్ సినిమాలలో ఎవరికీ అచ్చిరాని సీక్వెల్, సిరీస్ సినిమాలు కేవలం తమిళ హీరో సూర్య నటించిన సింగంకు మాత్రమే కలిసొచ్చాయి. హరి దర్శకత్వంలో ఇప్పటికే వచ్చిన సింగం 1, సింగం 2 సూపర్ హిట్లుగా నిలిచాయి. కేవలం తమిళంలో మాత్రమే కాకుండా డబ్ కాబడిన తెలుగు వర్షన్స్ కూడా విజయాన్ని సాధించాయి. సూర్య, అనుష్క జంటగా నటిస్తున్న ఈ సిరీస్ ఇప్పుడు మూడో దశకు చేరుకుంది. అలాగే బాలివుడ్ కూడా ఈ కథ, కథనాల మీద మనసు పడిందంటే ఇది ఎంతటి సక్సెస్ అయిందో అర్థమవ్వాలి. మాస్ జనాన్ని ఉర్రూతలూగించే పోరాటాలు, దుమ్మురేపే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, నరసింహస్వామీలోని రౌద్రాన్ని ప్రదర్శించే హీరో పోలీస్ నరసింహ, ఇలా అన్నింటా సింగం ఓహో అనిపించింది. అందుకే సింగం 3ని ముందు రెండింటికీ తగ్గకుండా ఉండేలా కథ తయారు చేసుకున్నారట హరి. ఇదిగో షూటింగ్ మొదలవబోయే ముందే సింగం 3 ఫస్ట్ లుక్ పోస్టర్లు బయటికి వదిలారు. ఎటువంటి అనుమానానికి తావివ్వకుండా పోస్టర్లతోనే ఇరగదీసే పని మొదలెట్టామని సూరి బాబు చెప్పకనే చెబుతున్నాడు. యూనివర్సల్ కాప్ అని క్యాప్షన్ పెట్టారంటే మళ్ళీ పరాయి దేశంలోని ఏ స్మగ్లింగ్ మాఫియా మీదో విరుచుకు పడిపోయేట్టున్నాడు. కాకపోతే ఈసారి గ్లామర్ మోతాదు కూడా శృతి హసన్ రాకతో పెరిగింది.