బ్రూస్ లీ, ఆగడుతో కెరీర్ ఆగమ్యగోచరంలో పడేసుకున్న దర్శకుడు శ్రీను వైట్లకు మళ్ళీ కాలం కలిసొచ్చేలా అనిపించింది. ఏ స్టార్ హీరో దగ్గరకు వెళ్ళినా మొహమాటానికి కూడా వైట్లతో సినిమాకు కమిట్ అవకపోవడంతో పాత స్నేహితుడు రామ్ హీరోగా ఓ సినిమా స్టార్ట్ చేసేందుకు ప్రయత్నాలు స్టార్ట్ చేసుకున్నాడు. ఎందుకంటే రామ్ కూడా వైట్ల లాగానే ఫ్లాపుల్లో పడి కొట్టుమిట్టాడుతున్నాడు. దొందూ దొందే అని క్రిటిక్స్ వ్యంగ్యంగా కూడా కాట్లేసారు. కానీ ఇక్కడే అసలు సిసలైన ట్విస్ట్ పడింది. ఇప్పుడు అందివచ్చిన నేను శైలజ హిట్టుతో రామ్ ఒక్కసారిగా తన బిజినెస్ సామర్థ్యాన్ని పెంచేసుకున్నాడు. శివమ్ లాంటి భారీ ఫ్లాపును కూడా తలదన్ని నేను శైలజతో పాతిక కోట్ల క్లబ్బులోకి చేరబోతున్నాడని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. నానా కష్టాలు పడి ఇప్పుడే గాడిలో పెట్టుకున్న బండిని మళ్ళీ వైట్లతో సినిమా ఒప్పుకుని రామ్ గతుకుల రోడ్డు మీదకి పడేసుకుంటాడా అన్నది అసలు ప్రశ్న. రామ్ ఒప్పుకున్నా బ్యాక్ బోన్ స్రవంతి రవికిషోర్ గారు దీనికి ఏమంటారు?