రజనీకాంత్, శంకర్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న 'రోబో 2.0' చిత్రంలో నెగటివ్ రోల్ చేస్తోన్న బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ ఇప్పుడు తన బరువును పెంచే పనిలో పడినట్లు సమాచారం. ఈ చిత్రం కోసం అతను స్పెషల్ ఫిట్‌నెస్ క్లాసులకు సైతం హాజరవుతున్నట్లు తెలుస్తోంది. మొదట్లో ఈ పాత్రకు అర్నాల్డ్‌ను అనుకొన్నారు. అయితే రెమ్యూనరేషన్ వంటి కొన్ని కారణాలతో అది మెటీరియలైజ్ కాలేదు. అలాగే ఈ సినిమా కోసం అక్షయ్ ఓ ప్రత్యేక శిక్షణ కూడా తీసుకొంటున్నాడు. అందుకోసం ఆయన చెన్నై వచ్చిపోతున్నాడని బాలీవుడ్ టాక్. డిసెంబర్ 16నుంచి ప్రారంభమైన ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. చెన్నైలో ఈ సినిమా కోసం వేసిన ప్రత్యేక సెట్‌లో రజనీ పాల్గొంటుండగా పలు సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రజనీ సరసన ఇందులో అమీజాక్సన్ నటిస్తోంది. ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని అందరూ ఎదురుచూస్తున్నారు. కాగా ఈ చిత్రానికి గ్రాఫిక్స్ వర్క్‌కు చాలా సమయం తీసుకోనుందని, అందువల్ల 2017 సమ్మర్‌లోగానీ ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం లేదని సమాచారం.