సంక్రాంతి సంబరం అంతా జూనియర్ ఎన్టీయార్ అభిమానుల్లోనే కనపడుతోంది. నందమూరి ఫ్యాన్స్ మధ్య చీలిక స్పష్టమవడంతో బాలకృష్ణ ఫ్యాన్స్ డిక్టేటర్ వైపు తారక్ ఫ్యాన్స్ నాన్నకు ప్రేమతో వైపు వరసలో నిల్చున్నారు. ఇక రెండింటి ట్రైలర్స్, పాటలు ఇతరత్రా ప్రమోషన్ స్టఫ్ మార్కెట్లో లభిస్తుండడంతో ఎవరికి వారు తమ తమ హీరోలని ముందుంచే కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఎంత చేసినా డిక్టేటర్ పాత చింతకాయ పచ్చడి వాసనే కొడుతుండడంతో స్టైలిష్ ఎన్టీయార్లోనే పైచేయి కనపడుతోంది. కానీ బాలకృష్ణ ఫాలోవర్స్ అంత వీజీగా ఓటమిని ఒప్పుకునేలా లేరు. డిక్టేటర్ పూర్తి కమర్షియల్ సినిమా అనీ, ఫ్లాష్ బ్యాకులో బాలయ్య బాబు చేసే నటన నిజమైన నియంతను తలపిస్తుందని, ఆ పోర్షన్ ఒక్కటి చాలు డిక్టేటర్ సూపర్ హిట్ అయ్యేందుకు అంటూ బాలయ్యను మోసేస్తున్నారు. తారక్ ఫ్యాన్స్ బాలకృష్ణ చిత్రాన్ని ఎంత నొక్కాలని, తొక్కాలని చూస్తే అంతగా పైకి లేస్తుందని, పొంగల్ రియల్ విన్నర్ మేమేం అంటూ అప్పుడే భీరాలు పోతున్నారు. మరి నొక్కితే పైకి లేసే బంతి ఫిలాసఫీ డిక్టేటర్ విషయంలో నిజమవుతుందా?