బడా హీరోలలో ఒక్క రవితేజ తప్ప ఇంకా పైస్థాయి హీరోలతో రొమాన్సుకి వెళ్ళలేకపోతున్న హీరోయిన్ రెజీనా కెరీర్ ఎటు వైపు వెళుతుందో ఆమెకయినా అర్థమవుతుందో లేదో. పాపం ఎప్పుడో 2005లో ప్రొఫెషన్ మొదలు పెట్టినా 2010 వరకు సరైన బ్రేక్ దొరకలేదు. రొటీన్ లవ్ స్టోరీతో తాను ఓ రొటీన్ హీరోయిన్ కాదని నిరూపించుకునే క్రమంలో కొన్ని క్రిటిక్స్ చేత మెప్పు పొందిన మంచి పాత్రలను కూడా చేస్తూ పోయింది. కానీ సందీప్ కిషన్, అల్లు శిరీష్ లాంటి మార్కెట్ తక్కువున్న హీరోల రేంజు దాటి వెళ్ళలేక పోతోంది రెజీనా. మధ్యలో రవితేజతో పవర్ వచ్చినా హన్సిక గ్లామర్ ముందు రేజీనా కనపడలేదు. అటు తరువాత మెగా బుల్లోడు సాయి ధరం తేజకు ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ నేనే సరిజోడు అన్నట్లుగా రెండు సినిమాల్లో వీరి ప్రేమ భాగోతం బాగానే సాగింది. రెజీనా అంటే చక్కటి పాత్రల్లో చిక్కటి నటన ప్రదర్శిస్తుంది అన్నది తప్పు అని అనుకునేలా రెజీనా మొన్న వచ్చిన సౌఖ్యం ఎంచుకుంది. ఒడిదొడుకులు లేకుండా సాగుతున్న బండిని సౌఖ్యంతో ఎత్తుపల్లాల్లోకి నెట్టినంత పని చేసింది. రేపు రానున్న విశాల్ కథాకళి, మంచు మనోజ్ శౌర్యలు గనక హిట్ టాక్ సాధిస్తే ఈసారైనా తన స్కేల్ మారాలని అమ్మడు ఆశపడుతోంది.