ఒకప్పుడు తెలుగు సినిమా క్లైమాక్స్ అంటే యాక్షన్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, భీకరపోరాటాలు... చివరకు హీరోనే గెలవడం, కొన్ని ఎమోషనల్ సీన్స్ ఇలా ఉండేవి. కానీ ఈమద్య తెలుగు సినిమాల క్లైమాక్స్‌లో కామెడీ వచ్చి చేరింది. చివరి అరగంటను, పతాక సన్నివేశాలను కమెడియన్లు దత్తత తీసుకుంటున్నారు. క్లైమాక్స్‌లో కితకితలు పెడుతూ, థియేటర్ బయటకు వచ్చే ప్రేక్షకులు నవ్వు మొహాలతో వచ్చేలా దర్శకులు వండివారుస్తున్నారు. వాస్తవానికి శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజ, నయనతార జంటగా వచ్చిన 'దుబాయ్ శీను' చిత్రంతో ఈ కొత్త ఒరవడికి బీజం పడింది. స్టార్ హీరోగా ఎమ్మెస్ నారాయణ ఎపిసోడ్ ఈ చిత్రం క్లైమాక్స్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక 'దూకుడు' చిత్రంలో కూడా బ్రహ్మానందం, ఎమ్మెస్‌నారాయణల జంట క్లైమాక్స్‌లో నవ్వులు పూయించింది. 'రేసుగుర్రం' సినిమానే తీసుకుంటే ఇందులో క్లైమాక్స్‌లో కిల్‌బిల్‌పాండేగా ఎంటర్ అయిన బ్రహ్మానందం కామెడీ సినిమాను నిలబెట్టింది. 'లౌక్యం' సినిమా క్లైమాక్స్‌లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఇరగదీశాడు. 'పిల్లా నువ్వులేని జీవితం'లో కూడా క్లైమాక్స్‌లో వచ్చే సాయిధరమ్‌తేజ్, ప్రకాష్‌రాజుల ఎపిసోడ్ చివరి 15 నిమిషాలు అదిరిపోయింది. అదే ఆ చిత్రానికి పెద్ద ఆకర్షణగా నిలిచింది. తాజాగా వచ్చిన 'భలే మంచిరోజు' చిత్రంలో సైతం పృథ్వీ మల్లెపుష్పం రామారావుగా ఇరగదీయడం ఈ చిత్ర విజయానికి చాలా ప్లస్ పాయింట్ అయింది. ఇలా టాలీవుడ్ క్లైమాక్స్‌ను ప్రస్తుతం ఫైటర్లు కాకుండా కమెడియన్లు ఏలేస్తున్నారు.