మేం అందరం నాన్న పిచ్చోల్లం అంటూ జూనియర్ ఎన్టీయార్ నిన్న నాన్నకు ప్రేమతో ఆడియో వేడుక స్టేజీ మీద దర్శకుడు సుకుమార్, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్, కెమెరామ్యాన్ విజయ్ చక్రవర్తిలకు తమ తమ తండ్రులపైనున్న ప్రేమానురాగాలను వివరిస్తుంటే, ఎంత చెప్పినా సరే మాటలకు అందని ఓ అనుభూతిని అభిమానులు ఆస్వాదించారు అన్నది నిజం. ఇది కేవలం పాటల పండగనే అయినా, ఒకరిని మించి ఇంకొకరు ఎమోషనల్ అయిపోతుంటే ఇది ఆడియో ఫంక్షనా లేకపోతే ఏడిపించే ఫంక్షనా అని కళ్ళ వెంట వస్తున్న నీళ్ళు తుడుచుకుంటూ ప్రేక్షకులు సైతం టీవీలకు అతుక్కుపోయారు. ఒకానొక సమయంలో దేవి శ్రీ ప్రసాద్ తన తండ్రి సత్యమూర్తి గారిని గుర్తుకు తీసుకుని ఏడుస్తుంటే, ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. అలాగే హరికృష్ణ గారేమో తండ్రి మహానుభావుడు ఎన్టీయార్ గురించి, కళ్యాణ్ రామ్ ఏమో డాడీ హరికృష్ణ గొప్పదనం గురించి మాట్లాడడం కొసమెరుపు. సాధారణంగా సినిమాలో వచ్చే ఎమోషన్స్, డ్రామా కనెక్ట్ అయితే వీక్షకులు కంటతడి పెట్టుకుంటారు. అది సినిమా పండింది అనడానికి ఓ నిదర్శనం. ఆఫ్ స్క్రీన్ మీద కూడా ఇంతలా ఫాదర్ సెంటిమెంట్ మీద ఎమోషన్ పండించిన నాన్నకు ప్రేమతో టీం మరి ఆన్ స్క్రీన్ మీద గనక ఇదే స్థాయిలో మాయాజాలాన్ని వర్క్ అవుట్ చేస్తే హిట్టు గ్యారంటీ. నాన్నంటే అందరికీ ఇష్టమే బట్ ఇంతలా ఏడిపించాలా బాబులూ!