కె.రాఘవేంద్రరావు శిష్యుడు రాజమౌళి. ఈ విషయంలో ఆయన గురువుని మించిన శిష్యునిగా పేరు తెచ్చుకున్నాడు. అలాగే ఇండస్ట్రీలో ఎక్కువ మంది శిష్యులను తయారుచేసినవారిలో దాసరి ముఖ్యుడు. ఇక డైరెక్టర్‌గా తనకు పెద్దగా గుర్తింపు లేకపోయినప్పటికీ నేటి స్టార్ డైరెక్టర్లలో చాలామంది సాగర్ శిష్యులే. కానీ అదేమి విచిత్రమే కానీ, రాజమౌళి అంత మంచి డైరెక్టర్ అయినప్పటికీ ఆయన శిష్యులు డైరెక్టర్లుగా మారి హిట్స్ ఇవ్వలేకపోతున్నారు. అలా కత్తిలాంటి శిష్యులను తయారుచేయడంలో రాజమౌళి విఫలమవుతున్నాడు. గురువు సూపర్‌హిట్-శిష్యులు అట్టర్‌ఫ్లాప్ అనే రీతిలో సాగుతోంది రాజమౌళి శిష్యుల వ్యవహారం. ఇప్పటివరకు ఆయన శిష్యుల్లో ఎవ్వరూ సరైన హిట్ కొట్టలేకపోయారు. అప్పుడెప్పుడో మహదేవ్ అనే రాజమౌళి శిష్యుడు బాలకృష్ణ హీరోగా 'మిత్రుడు' అనే చిత్రం తీశాడు. ఈ చిత్రం ఫ్లాపయింది. ఆ తర్వాత ఆయన ఏమయ్యాడో ఎవ్వరికీ తెలియదు. ఇక నితిన్ హీరోగా 'ద్రోణ' చిత్రానికి దర్శకత్వం వహించిన రుణకుమార్ కూడా రాజమౌళి శిష్యుడే. ఆ చిత్రం కూడా అట్టర్‌ఫ్లాప్. ఇక 'సారాయివీర్రాజు' తీసిన కన్నన్, 'దిక్కులు చూడకు రామయ్యా' వంటి బిలో యావరేజ్ చిత్రాన్ని తీసిన త్రికోటి వంటి వారు కూడా డైరెక్టర్లుగా పేరు తెచ్చుకోలేకపోయారు. తాజాగా రాజమౌళి మరో శిష్యుడు జగదీష్ తలసల అనే కొత్త దర్శకుడు 'లచ్చిందేవికో లెక్కుంది' అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రం జనవరి 1వ తేదీన విడుదలకు సిద్దమవుతోంది. మరి ఈ శిష్యుడు ఎలాంటి చిత్రం తీస్తాడో వేచిచూడాల్సివుంది...!