తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్‌ది అంతా నా ఇష్టం అనే ధోరణి. ఆయన సినిమా షూటింగ్ ముహూర్తం జరుపుకున్న తర్వాత ఎంతటి హీరోహీరోయిన్లయినా సరే ఆయన సినిమాకు పూర్తిగా అంకితం కావాల్సిందే. ఆ సినిమాను కాదని వేరే చిత్రాలు చేయడానికి ఒప్పుకోడు. చివరకు రజనీకాంత్ అయినా సరే ఆయన మాట జవదాటడానికి లేదు. కానీ 'రోబో2.0' విషయంలో ఆయనలో కాస్త మార్పు కనిపిస్తోంది. ఇటీవల ముహూర్తం జరుపుకున్న ఈ చిత్రంలోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను శంకర్ చెన్నై పరిసర ప్రాంతాల్లో వేసిన ఓ సెట్లో షూటింగ్ జరుపుతున్నాడు. కానీ ఈ చిత్రానికి రజనీ గానీ, అమీజాక్సన్ గానీ పూర్తిగా అంకితం కావడం లేదు. జనవరిలో రజనీకాంత్ రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న 'కబాలి'కి డేట్స్ ఇచ్చాడు. అలాగే అమీజాక్సన్ కూడా మరో తమిళ చిత్రంలో జాయిన్ కానుంది. వీరిద్దరూ ఫ్రీ అయ్యేవరకు వారు లేని సన్నివేశాలను, ఇతర నటీనటులపై వచ్చే సన్నివేశాలను శంకర్ చిత్రీకరించనున్నాడు. ఆ తర్వాత రజనీ, అమీల కోసం కొన్నిరోజులు షూటింగ్‌కు బ్రేక్ కూడా ఇవ్వనున్నాడు శంకర్. మొత్తానికి ఈ విషయంలో శంకర్ కాస్త మెత్తపడ్డాడనే చెప్పాలి.