హిందీ సినిమాలు వంద కోట్లు దాటాయంటే ఆనందం, ఆశ్చర్యం పోయి... అబ్బే అంతేనా అనే పరిస్థితి వచ్చింది. అదీ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్ లాంటి హీరోల తాలూకు చిత్రాలయితే వంద కాదు అయిదు వందల కోట్లు టార్గెట్ పెట్టేస్తున్నారు. ఆమీర్ ఖాన్ PK, సల్మాన్ ఖాన్ భజరంగీ భాయిజానులు నిజంగా భారతీయ సినిమా సత్తాను అమాంతంగా ఆకాశానికి ఎత్తేసాయి. యాభై, అరవై కోట్ల కలెక్షన్స్ నుండి వంద కోట్ల మార్కు దాటడానికి పట్టిన సమయంలో ఒకటో వంతు కూడా పట్టకుండా రెండు వందలు, మూడు వందలు, నాలుగు వందలు, అయిదు వందలు దాటేసి ఇప్పుడు ఆరు వందల కోట్లకు హిందీ సినిమా పరుగులు తీస్తోంది. అందుకేనేమో మొన్న విడుదలయిన షారుఖ్ ఖాన్ దిల్ వాలే, సంజయ్ లీల భన్సాలి బాజీరావు మస్తానీలు అయిదు రోజుల్లో వంద కోట్ల మార్కు దాటాయని మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతున్నా ఎవరికీ పెద్దగా ఆనట్లేదు. పాన్ ఇండియా, పాన్ వరల్డ్ మార్కెట్ కలిగిన బాలివుడ్ వెయ్యి కోట్ల వైపు తన గమనాన్ని సాగిస్తుంటే, దక్షినాది టాలీవుడ్, కాలీవుడ్ కన్ను వంద కోట్ల పై పడింది. ఓ తెలుగు సినిమానో, తమిళ సినిమానో సెంచరీ కొడితే సంబరపడాలి గానీ హిందీ సినిమా చేస్తే అబ్బురపడాల్సింది ఏమీ లేదు...