రెండూ రికార్డులు బ్రేక్ చేసిన సినిమాలే. ప్రపంచవ్యాప్తంగా చర్చను లేవనెత్తుతూ దక్షిణాది సినిమాల సత్తాని చాటి చెప్పినవే. ఆ రెండింటికీ సీక్వెల్స్ రాబోతున్నాయి. గమ్మత్తుగా ఆ రెండు సీక్వెల్సూ ఒకే రోజు మొదలయ్యాయి. ఇంతకంటే విశేషం మరొకటి ఉంటుందా?! రెండు భారీ సినిమాలు ఒకే రోజు మొదలుకావడంతో దక్షిణాది చిత్రసీమలో నయా జోష్ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
శంకర్ దర్శకత్వంలో ఇదివరకు వచ్చిన రోబో ఎన్నెన్ని సంచలనాలు సృష్టించిందో తెలిసిన విషయమే. దానికి సీక్వెల్‌గా రోబో... 2.0 పేరుతో ఓ చిత్రాన్ని మొదలుపెట్టారు. అందులోనూ రజనీకాంతే కథానాయకుడిగా నటిస్తున్నాడు. కథానాయికగా మాత్రం అమీజాక్సన్‌ని ఎంచుకున్నారు. విలన్‌గా హృతిక్ రోషన్ నటిస్తాడని ప్రచారం సాగుతోంది. ఈ రోజే(DEC16) చెన్నైలో ఆ సినిమా మొదలైంది. వశీకర్, చిట్టిల సందడిని మరోసారి తనివి తీరా చూడొచ్చన్నమాట.
అలాగే రాజమౌళి తీసిన కళాఖండం బాహుబలికి సంబంధించిన సీక్వెల్ కూడా ఈ రోజే(DEC16) మొదలైంది. బాహుబలి ది కన్‌క్ల్యూజన్ పేరుతో రానున్న ఆ సినిమాకోసం నెలన్నర రోజులుగా రామోజీ ఫిల్మ్‌సిటీలో సెట్స్ పనులు జరుగుతున్నాయి. తాజాగా అక్కడే చిత్రీకరణ మొదలుపెట్టారు. వందల కోట్ల వ్యయంతో తెరకెక్కుతున్న ఈ రెండు చిత్రాలూ ఒకే రోజు సెట్స్‌పైకి వెళ్లడం యాథృచ్ఛికమే. మరి ఈ రెండూ ఒకే సారి విడుదలవుతాయేమో చూడాలి. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ చిత్రాలు ఎన్నెన్ని సంచలనాల్ని సృష్టిస్టాయో చూడాలి.