హీరో సునీల్ తన కెరీర్‌ని బలపరుచుకోవడానికి కష్టపడుతున్నా అనుకున్న స్థాయిలో అతనికి కలిసిరావడం లేదు. అంతెందుకు... 'భీమవరం బుల్లోడు' తర్వాత ఇప్పటికి ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. మరోపక్క సునీల్ హీరోగా చేసిన కొత్త సినిమా 'కృష్ణాష్టమి' రిలీజ్‌కు అడ్డంకులెన్నో ఏర్పడుతున్నాయి. ఆ సినిమా షూటింగ్ పూర్తి అయి చాలాకాలం అయింది. సుమారు మూడు నెలల నుండి వాయిదాలు పడుతూనే వస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని భావించినా అది కూడా ఫిబ్రవరికి వాయిదా వేయడానికి దిల్‌రాజు ప్రయత్నం చేస్తున్నాడని సమాచారం. నిజానికి నవంబర్‌లోనే విడుదల అవ్వాల్సిన ఈ సినిమా 'అఖిల్'తో పాటు పలు పెద్ద సినిమాల విడుదల వల్ల వాయిదాపడింది. పోనీ పొంగల్‌కు విడుదల పెట్టుకుందామంటే.. ఇప్పుడు సంక్రాంతికి ఎన్టీఆర్, బాలకృష్ణ, నాగార్జున చిత్రాలు రిలీజ్‌కు సిద్దం అవుతున్నాయి. దీంతో ఇప్పటికీ 'కృష్ణాష్టమి'కి కష్టాలు తప్పడం లేదు.