చిన్న సినిమా తీయడం కాదు.. దానికి సరైన ప్రచారం చేయడం.. నిలబెట్టుకోవడం, జనాలు ఆ సినిమా గురించి మాట్లాడుకునేలా చేయడం గ్రేట్. 'కుమారి 21ఎఫ్' కోసం సుకుమార్ అచ్చంగా ఇదే చేశాడు. ఐదు కోట్లతో తీసిన ఈ సినిమా ఏకంగా నాలుగైదు రెట్లు లాభాలు తెచ్చుకుంటోంది. వాస్తవానికి స్టార్ డైరెక్టర్లు చిన్న సినిమాలంటే కాస్త చిన్న చూపు చూస్తారు. వారికున్న డిమాండ్ దృష్ట్యా కేవలం స్టార్ హీరోలతో మాత్రమే వారు సినిమాలు చేస్తుంటారు. కానీ తమకొచ్చిన సరికొత్త ఆలోచనలను, కథలను వీరు తెరకెక్కించాలంటే అది కాస్త ఇబ్బందితో కూడిన వ్యవహారం. ఆల్‌రెడీ తమిళంలో స్టార్‌డైరెక్టర్లు అయిన శంకర్, మురుగదాస్ వంటివారు ఎప్పటి నుండో ఇదే రూటును ఫాలో అవుతూ, కథాబలం ఉన్న చిన్న చిత్రాలను చేయాలని భావించినప్పుడు వేరే దర్శకులతో వాటిని నిర్మాతలుగా మారి తీస్తున్నారు. అవసరమైతే కథ, స్క్రీన్‌ప్లే, మాటలు వంటివి తెరపైన ఉండి అందించడంతో పాటు తమ కనుసన్నలలో ఈ చిత్రాలు తెరకెక్కిస్తూ మంచి విజయాలు సాదిస్తున్నారు. గతంలో పూరీ జగన్నాధ్ వంటి దర్శకులు ఈ పని చేసినప్పటికీ కేవలం తమ తమ్ముడిని మాత్రమే దృష్టిలో ఉంచుకొని ఇలాంటి ప్రయత్నాలు చేయడంతో అవి ఆశించిన స్థాయిలో ఆడకపోవడం తెలిసిన విషయమే. కాగా ఇప్పుడు సుకుమార్ నడిచిన బాటలో నడవాలని, కేవలం తన తమ్ముడి కోసమే కాకుండా నిజాయితీగా తమకు నచ్చిన చిన్న చిత్రాలను తెరకెక్కించాలని పూరీ డిసైడ్ అయ్యాడని సమాచారం. త్వరలో అలాంటి ఓ ప్రాజెక్ట్‌ను తన శిష్యుని దర్శకత్వంలో చేయడానికి పూరీ సన్నాహాలు చేస్తున్నాడు. ఇక పెద్ద స్టార్ డైరెక్టర్ కానప్పటికీ ఇప్పటికే మారుతి ఈ ఒరవడికి ఎప్పుడో శ్రీకారం చుట్టాడు. తాజాగా హరీష్‌శంకర్‌తో పాటు మరికొంత మంది ఇదే బాటలో నడవాలని నిర్ణయించుకొన్నట్లు సమాచారం. మొత్తానికి ఇలా ఓ మంచి పనికి చాలా మంది ముందుకు రావడం తెలుగు సినీ పరిశ్రమను కొత్త పుంతలు తొక్కిస్తుందని భావించవచ్చు.