రాబోయే క్రిస్మస్ కానుకగా అంటే డిసెంబర్ 25న మూడు చిత్రాలు విడుదలకు పోటీపడుతున్నాయి. ఈ మూడుచిత్రాలకు ఇండస్ట్రీలో, ట్రేడ్‌వర్గాల్లో మంచి క్రేజ్ ఉండటం గమనార్హం. మోహన్‌బాబు, అల్లరినరేష్‌ల కాంబినేషన్‌లో దర్శకుడు శ్రీనివాస్‌రెడ్ది తెరకెక్కిస్తున్న 'మామ మంచు.. అల్లుడుకంచు' చిత్రం డిసెంబర్25న విడుదలకు సిద్దమవుతోంది. మరోపక్క గోపీచంద్ హీరోగా రెజీనా హీరోయిన్‌గా రూపొందుతున్న 'సౌఖ్యం' చిత్రం కూడా అదేరోజున విడుదల కానుంది. 'యజ్ఞం' సినిమాతో గోపీచంద్‌ను హీరోగా నిలబెట్టిన దర్శకుడు రవికుమార్ చౌదరి చాలా గ్యాప్ తర్వాత మరలా గోపీచంద్‌తో చేస్తున్న చిత్రం ఇది. ఇక 'ప్రేమకథాచిత్రమ్, కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' చిత్రాలతో అందరినీ ఆకట్టుకున్న హీరో సుధీర్‌బాబు నటిస్తున్న 'భలేమంచి రోజు' చిత్రాన్ని కూడా అదే రోజున విడుదల చేయనున్నారు. ఘట్టమనేని అభిమానులకు ఈ చిత్రంపై మంచి ఆశలే ఉన్నాయి. సినిమా కూడా చాలా బాగా వచ్చిందని ఇండస్ట్రీ టాక్. కాగా ఈచిత్రం నైజాం రైట్స్‌ను దిల్‌రాజు సొంతం చేసుకోవడం, ఇటీవల విడుదలైన టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ లభిస్తుండం గమనార్హం. ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నాడు. దీంతో పాటు అన్ని ఏరియాల నుండి ఈ చిత్రానికి మంచి బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయి. మరి ఈ మూడు చిత్రాలు డిసెంబర్ 25నే విడుదల అని అంటున్నారు. మరి ఈ మూడు చిత్రాలు ఒకే రోజున విడుదల అవుతాయా? లేక ఈలోపల ఏవైనా చిత్రాలు పోస్ట్‌పోన్ అవుతాయా? అన్నది వేచిచూడాల్సిన అంశం...!