ఎమ్మెస్ నారాయణ, ధర్మవరపు సుబ్రమణ్యం, ఏవీఎస్, కొండవలస వంటి కమెడియన్లు ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయారు. ఇక బ్రహ్మానందంతో సహా, వేణుమాధవ్, కృష్ణభగవాన్ వంటి కమెడియన్లు నవ్వించడంలో వెనుకబడిపోయారు. సప్తగిరి, తాగుబోతు రమేష్, ధన్‌రాజ్, వెన్నెల కిషోర్ వంటి వారు ఇంకా పూర్తిగా ఒంటిచేత్తో సినిమాను నిలబెట్టే సమయం రాలేదు. ఇదే అదనుగా భావించిన 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ దూసుకుపోతున్నాడు. బాయిలింగ్ స్టార్ బబ్లూ అయిన పృథ్వీ నిజంగానే ఇండస్ట్రీకి వచ్చి 30ఏళ్లు అయింది. కానీ ఆయనకు సరైన గుర్తింపు రావడానికి ఇంతకాలం పట్టింది. 'ఖడ్గం' చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకొని 'లౌక్యం' సినిమాతో నక్కతోక తొక్కాడు పృథ్వీ. ప్రస్తుతం కామెడీకి కేరాఫ్ అడ్రస్‌గా మారాడు. 60ఏళ్ల వయసులో తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ రెచ్చిపోతున్నాడు. రాబోయే చాలా చిత్రాల్లో ఆయన హాస్యాన్ని కొత్త పుంతలు తొక్కించడానికి రెడీ అవుతున్నాడు. తాజాగా వచ్చిన 'శంకాభరణం'లో కూడా కేవలం నవ్వించింది పృథ్వి ఒక్కడే. పర్సంటేజ్ పరమేశ్‌గా ఆయన తనదైన హాస్యాన్ని పండించాడు. కాగా త్వరలో విడుదలకు సిద్దమవుతోన్న 'బెంగాల్‌టైగర్, సౌఖ్యం, డిక్టేటర్' వంటి చిత్రాల్లో కూడా పృధ్వీ అదిరిపోయే కామెడీ పండించినట్లు సమాచారం. మొత్తానికి ఇప్పుడు టాలీవుడ్‌కు స్టార్ కమెడియన్ ఎవరయ్యా అంటే చాలు టక్కున పృథ్వీ పేరే చెప్పేస్తున్నారు.