అన్నీ అనుకున్నట్టు జరిగుంటే ఇప్పుడు పవన్ పక్కన ఆడుతూ పాడుతూ గడిపేది. కానీ ఆ అవకాశం అందినట్టే అంది అనూహ్యంగా చేజారింది. దీంతో అప్పటిదాకా పవన్ హీరోయిన్ అని ప్రచారంలో ఉన్న అనీషా ఆంబ్రోస్ అడ్రస్ గల్లంతైనట్టయింది. అయితే ఇప్పుడు ఆమెకి యువ కథానాయకుడు సందీప్‌కిషన్ ఆఫర్ ఇచ్చాడు. తాను కథానాయకుడిగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో రూపొందుతున్న ఓ చిత్రంలో కథానాయికగా అనీషాకి అవకాశం ఇచ్చాడు. తమిళంలో విజయవంతమైన నేరమ్‌కి రీమేక్‌గా సందీప్ చిత్రం తెరకెక్కుతోంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లబోతోంది. మరి చాలా కాలం తర్వాత అనీషాకి దక్కిన ఈ అవకాశాన్ని ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి.
అలియాస్ జానకి అనే చిన్న సినిమాతోనే ఎంట్రీ ఇచ్చినా అనీషా అనుకోకుండా పవన్‌కళ్యాణ్ దృష్టిలో పడింది. గోపాల గోపాల చిత్రంలో టీవీ యాంకర్ పాత్రలో నటిస్తుండగా పవన్ దృష్టిలో పడింది. అందంగా కనిపించడంతో తన కొత్త సినిమా సర్దార్ గబ్బర్‌సింగ్ కోసం అనీషాని ఎంపిక చేసుకోవాలనుకొన్నాడు. ఇద్దరిపై కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించినట్టు తెలిసింది. అయితే సినిమా సెట్స్‌పైకి వెళ్లేసరికి ఆ నిర్ణయం మారింది. మార్కెట్ వర్గాలు అభ్యంతరం చెప్పడంతో అనీషా స్థానంలో కాజల్ చేరింది. దీంతో అనీషా ఆశలు గల్లంతయ్యాయి. ఆ తర్వాత మళ్లీ ఆమె టాలీవుడ్‌లో కనిపించలేదు. కానీ ఇటీవల సందీప్ సినిమాలో ఛాన్స్ అందుకొంది. అయితే పవన్ కూడా ఎప్పుడో ఒకసారి తన సినిమాలో అనీషాని తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నాడట.