ఎటువంటి హీరోయిన్ అయినా కమర్షియల్ సినిమాల్లో విజయాన్ని సాధించి, స్థానం సుస్థిరం చేసుకున్న తరువాత తమను తాము ఆవిష్కరించుకునే కథలు దొరుకుతాయా అన్నట్లుగా కొన్ని కొన్ని కథలు, దర్శకుల కోసం అన్వేషిస్తారు. అవే హీరోయిన్ ప్రధానంగా సాగే కథలయితే మరింత గిరాకీ. విజయశాంతి కూడా మొదట గ్లామర్ దారిలో గమ్యాన్ని చేరుకొని అటు తరువాతే లేడీ అమితాబ్ అనిపించుకుంది. ఇప్పుడు అనుష్క కూడా అదే ఫాలో అవుతోంది. కానీ అనుష్కతో పాటే నయనతార కూడా ఈ మధ్య కథానాయిక ప్రధానమైన సినిమాల వైపు ఎక్కువ దృష్టి సారించిందన్న విషయం అంతగా పబ్లిసిటీ కావడం లేదు. శేఖర్ కమ్ముల అనామిక కానివ్వండి, మొన్న విడుదలయి హిట్టయిన మయూరి లేదా తమిళంలో నిర్మాణ దశల్లో ఉన్న కాష్మోర మరియు సర్కునమ్ సినిమాస్ పతాకంపై రామస్వామి దర్శకుడిగా పరిచయం కాబోతున్న మరో సినిమా, మలయాళంలో వస్తున్న థ్రిల్లర్ పుతియ నియమం సినిమాలు కూడా నయనతార ప్రధానంగా సాగేవే. వీటికి తోడుగా గ్లామర్ పాత్రలని కూడా నయన వదలటం లేదు. బాలకృష్ణ, వెంకటేష్ సరసన చేసేందుకు కూడా లైన్ క్లియర్ చేసుకుంది.